రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 – 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ సాటిలేని భక్తికీ రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
జీవితకాల నిర్ణయం :- చరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 – 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.) సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ ‘పింగళ’ సంవత్సరంలో జన్మించి, మరో ‘పింగళ’ సంవత్సరంలో పరమపదించారు. తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.
జన్మ స్థలం :- మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరులో శ్రీమాన్ ఆసూరి ‘సర్వక్రతు’ కేశవ సోమయాజి దీక్షితార్, కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి ‘సర్వక్రతు’ బిరుదును పొందిన కేశవ సోమయాజి ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో భార్య కాంతిమతితో కలసి తిరువళ్ళిక్కేణి ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశంతో శ్రీపెరుంబుదూరును వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యుడు.
నామకరణం :- శిశువు యొక్క జనన మాసం దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల మామ అయిన పెరియ తిరుమల నంబి ‘శ్రీశైలపూర్ణుడు’ ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, “ఇళయ పెరుమాళ్” అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి నమ్మాళ్వార్ తన ‘తిరువోయ్‌మోళ్ళి’ అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.
ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో ‘కంచిపూర్ణుడు’ అనే భక్తుడు రోజూ కాంజీవరం (నేటి కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా ‘పూణమ్మెల్లె’ అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధాభక్తులు చిన్ని ఇళయ పెరుమాళ్‌ను ఎంతగానో ఆకర్షించాయి. భగవంతునిపైనున్న అతడి భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత ‘కంచిపూర్ణుడు’ తనకు గురుసమానుడని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు.
కార్యకలాపాలు :- రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలు, పరిపాలన పద్ధతులు ఏర్పరచడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో విస్తృత పర్యటనలు, వాద ప్రతివాదాలు చేశారు. ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తాడు.
గురువు ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్ని బయటకు చెప్పకూడదు అన్న నియమాన్ని అతిక్రమించి గుడి రాజగోపురం పైకి అందరికి వినబడేలా బిగ్గరగా మంత్రాన్ని చెప్పడానికి సంసిద్ధం అయిన క్షణంలో గురువు అంటాడు ఈ మంత్రాన్ని ఇతరులకు చెబితే ‘నీవు నరకానికి వెడతావేమో’ నని అంటే నాకు ఏ మైన పర్వాలేదు కానీ ప్రజలందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు. తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు.
శ్రీరంగంలో శ్రీరామానుజచార్యుల దివ్య శరీరం నేటికి ఉంది. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం.
కొందరు శ్రీరంగంలోని 4 వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా… అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
ప్రాచుర్యంలోకి రాని రహస్యం :- క్రీస్తు శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం ప్రాచుర్యం లభించక పోవడం వలన ఎవరికీ తెలియలేదు. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.