- ఆసనం అంటే ఏమిటి?
- వేటిని ఆసనములుగా ఉపయోగించాలి?
- దేనిమీద కూర్చొని పూజ చేయకూడదు?
- ఏ ఆసనం మీద కూర్చోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగును?
- మనం వేసుకొనే ఆసనము ఎంత ఎత్తులో ఉండాలి?
- అనారోగ్యంగా ఉండి కింద కుర్చోలేని వారు ఎటువంటి ఆసనాన్ని ఉపయోగించాలి?
ఆసనం అంటే ఏమిటి?
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం|
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం||
పూజ చేసేటప్పుడు ఆసనానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పై శ్లోకం ద్వారా ఆసనంలోని అక్షరాల సంస్కృత అర్ధాలను పరిశీలిస్తే…
‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తూ, ‘స’ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.
ఆ రోజుల్లో పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా పులిచర్మం, కృష్ణాజినం తప్ప మిగితావాటిని అసనాలుగా ఉపయోగించవచ్చు.
పూజ చేసే సమయంలో నేలమీద కూర్చుని పూజ చేయకూడదు. వ్రతాలు, నోములు ధ్యానం, స్తోత్రాదులు చేసేటపుడు భగవంతునికి ఎదురుగా ఆసనం మీద ఆసీనులు కావాలి. ఉచితాసనం పైన కూర్చునే ధార్మిక కార్యాలు చేయాలని, ఆసనం లేకుండా చేసే పూజ దైవకార్యాలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వవని బ్రహ్మాండపురాణం చెప్తోంది.
దేనిమీద కూర్చొని పూజ చేయకూడదు?
- దేవాలయాల్లో పూజారులు కానీ నేలపైన కూర్చుని పూజచేసినట్లు అయితే వారికి కష్టాలు, మానసికవేదన, చిత్త్భమ్రబాధలు, దుఃఖాలు కలుగుతాయి. అందుకనే వారు దర్భాసనం, కూర్మాసనం లేదా పుల్లల చాప లాంటివి ఆసనాలుగా ఉపయోగిస్తారు.
- రాతి మీద కూర్చుని పూజచేస్తే అనారోగ్యాలు కలుగుతాయి.
- చెక్కపైన కూర్చుని చేస్తే దురదృష్టం సంపద నష్టం లాంటివి కలుగుతాయి.
- గడ్డిపైన కూర్చుని పూజచేస్తే ఇతరులనుంచి అవహేళన, అమర్యాద కలుగుతాయి.
- వెదురు చాపపై కూర్చుని పూజించడం కూడా దారిద్య్రానికి గురౌతారు.
- బట్టపైన కూర్చుని పూజచేస్తే హాని కలుగుతుంది.
ఏ ఆసనం మీద కూర్చోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగును?
- ప్రత్యేకంగా పూజకోసమే తయారుచేసుకొన్న పుల్లల చాపపైన కూర్చుని చేసే అదృష్టం, సంపదవృద్ధి కలుగుతాయి.
- కృష్ణజింకచర్మం పైన కూర్చుని పూజ చేయడం సర్వ శ్రేష్ఠం అంటారు.
- తివాచి పైన కూర్చుని కూడా పూజ చేయవచ్చు. ఏకాగ్రత కలుగుతుంది.
- పట్టు వస్త్రాన్ని ఆసనంగా ఉపయోగించడం వల్ల శ్రేయస్సు కలుగును. కానీ దీనిని పవిత్రంగా భద్రపరుచుకోవాలి.
- అలానే ఎరుపు రంగు కంబళిపైన కూడా కూర్చుని పూజ చేయడం వలన సంపదలు కలుగును.
- వీటిలో కనీసం ఏ ఒక్కటి ఆసనంగా లేకపోయినా కనీసం అక్షతలను కింద వేసుకొని కూర్చొని పూజ చేయవచ్చును.
మనము వేసుకొనే ఆసనం ఎన్నడూ భగవంతుడి పీఠము కంటే ఎత్తులో ఉండరాదు. కానీ…
‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ కావునా… శరీర రుగ్మతల దృష్ట్యా కింద కూర్చొని పూజ చేయలేని వారు ఎత్తైన కుర్చీపై దర్భాసనమును వేసుకొని, పూజ చేయదలచిన పూజా పీఠమును కొంచెం ఎత్తుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని భగవంతుడిని పూజించవచ్చు.
గమనిక: పూజ, ధ్యానం లేదా జపం పూర్తి అయిన తర్వాత ఆసనమును తప్పక తీసి భద్రపరచవలెను.