భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఆశీర్వచనానికి చాలా విశిష్టత ఉంది. అనేక సందర్భాలలో ఆశీర్వచనాలు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.
- విద్యార్ధులకు అఖండ విద్యా ప్రాప్తిరస్తు అని,
- వివాహం కాని వారికి పాణిగ్రహణతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని,
- పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని,
- దంపతులను అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని,
- చిన్న పిల్లలను దీర్ఘాయుష్మాన్ భవ అని , సమయానికి తగ్గట్లు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు.
అసలు ఈ ఆశీర్వచనం లేదా దీవెనలు నిజంగా ఫలితాలని ఇస్తాయా లేదా మాటవరసకు చెప్పే మాటలా??? ఇప్పుడు చూద్దాం…
యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు, వేదోక్త ప్రకారంగా జరిగే విశేష కార్యక్రమాలలో లేదా ఇంట్లో చేసుకొనే చిన్న చిన్న పూజలకు పండితులు లేదా పురోహితులు కార్యక్రమం చేయించుకొనే యజమానులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అంతే కాక ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా వారికంటే చిన్న వారిని దీవిస్తూ ఉంటారు.
సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలగడంతో పాటుగా, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.
గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా సరే, వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అక్కడ మనం నమస్కరించేది వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి కానీ వారి వయసుకి ఏమాత్రం కాదు.