శివాలయంలో శివలింగాన్ని నేరుగా చూసి దర్శనం చేసుకొంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే…
సాధారణంగా శివాలయానికి వెళ్ళినపుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర) దేవతల దర్శనం చేసి పరమశివుని దర్శనం చేసుకొంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణ దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.
ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి, అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు.
మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. అలా చూడటం వెనుక రహస్యమేమిటంటే…
పరమశివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహం రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపమును మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి.
నంది యొక్క పృష్ట భాగమును నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వురిని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. అనంతరం శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.