స్త్రీలు బట్టలు ఉతికిన నీళ్ళని కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమట – నిజమేనా? అని ప్రశ్నిస్తే ఒకవిధంగా అవుననే చెప్పాలి. చాలమంది స్త్రీలు మురికి పట్టిన బట్టలని ఉతికి ఆ నీటిని ఆలోచించకుండా కాళ్ళ మీద పోసుకుంటారు. ఈవిధంగా చేయటంవల్ల పుట్టింటికి అరిష్టమే!
ఆడవారు ఎక్కువ సమయం నీటిలో ఉండి పనిచేయటం వల్ల కాళ్ళకూ, చేతులకూ పగుళ్ళు వస్తాయి. నూటికితొంభై మంది మధ్యతరగతి / ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళుకు పగుళ్ళు ఏర్పడతాయి. స్త్రీలు బట్టలుతికిన నీటిని(మురికి నీటిని) కాళ్ళపై పోసుకోవటం ద్వారా ఎన్నో రకాల క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యాన్ని కలగచేస్తాయి. సాధారణంగా అస్వస్థతకి గురియైన స్త్రీని భర్త పుట్టింటికి పంపిస్తాడు. ఆపై స్త్రీ భారం పడేది పుట్టింటి వారిమిదే.
కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని ప్రతీ తల్లి, తండ్రీ కోరుకుంటారు. కానీ ఈవిధంగా అనారోగ్యంతో పుట్టింటికి వచ్చిన కూతురిని చూసి బాధపడటం పుట్టింటికి అరిష్టమే కదా!!!