పిండి దీపారాధన చేయడము వల్ల లాభమేమి? దీపావళి రోజులలో పిండి దీపారాధన చేస్తే ఏమవుతుంది?
ధనత్రయోదశి నుంచి దీపావళి పండుగ శోభలు సంతరించుకొంటాయి. ఈ రోజులలో ఇంటి ముంగిళ్ళ యందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహంతో పాటుగా సమవర్తి అనుగ్రహం కూడా కలుగును. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి, రెండవది నరక చతుర్దశి, మూడవది దీపావళి అమావాస్య, నాలుగవది గోవర్ధన పూజ, ఐదవది బలి పాడ్యమి.
అయితే ఈ ఐదు రోజులు లక్ష్మీ అమ్మవారిని పూజించి, పిండితో చేసిన ప్రమిదలో నువ్వుల నూనె / ఆవు నేతిని పోసి పారాధన చేయడము సకల శుభములను చేకూర్చును. అసలు పిండి దీపం ఎందుకు పెడుతుంటారో చాలామందికి తెలియదు.
గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారుచేయాలి. పచ్చిపిండిలో నూనె పోసి వెలిగించరాదు కావునా దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. ప్రమిద ఆరిన తరువాత నువ్వుల నూనె / ఆవు నేతిని పోసి ఒత్తులు వెలిగించాలి. సాధారణంగా సాయం సంధ్య వేళలో 6 నుంచి 7 గంటల మధ్య వెలిగించుట ఉత్తమం. దీపం కనీసము 4 గంటల నుంచి 5 గంటల వరకు వెలిగేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సమవర్తి అయిన యముని అనుగ్రహం కలిగి అపమృత్యువు తొలగి, దీర్ఘాయువు కలుగును. దీపావళి రోజులలో వెలిగించే ఈ దీపానికి యమదీపం అని పేరు. పిండి దీపం మన చేత్తో మనమే తయారుచేస్తాము కాబట్టి సంవత్సరమంతా ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని, అలాగే సంవత్సరమంతా శరీర రుగ్మతలను తొలగించి సంతోషంగా జీవించేలా కాపాడమని యముడిని కోరవలెను. నాలుగు ఒత్తులు పెట్టి నాలుగు దిశల్లో కోరడం వల్ల ఎటువైపు నుంచి దుష్ట శక్తి అయినా మాపైకి వస్తే మీరే కాపాడాలని ఆ ఒత్తులను వెలిగించాలి. అంతే కాకుండా సాధారణ రోజులలో కూడా ఈ పిండి దీపారాధన చేయడము వల్ల మాహాలక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ధన ధాన్య సంపత్తికి ఏ లోటూ లేకుండా అమ్మ అనుగ్రహాన్ని కూడా పొందవచ్చును.