ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి [Sri Viswavasu Nama Samvatsara Vruschika Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 2 వ్యయం – 14
- రాజపూజ్యం – 5 అవమానం – 2
ఎవరెవరు వృశ్చిక రాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు వృశ్చిక రాశి లోకి వస్తారు.
- విశాఖ 4వ పాదం(తో)
- అనురాధ 1,2,3,4 పాదాలు (న, ని,ను, నే)
- జ్యేష్ట 1,2,3,4 పాదాలు (నో, య, యి, యు)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వృశ్చికరాశి ఫలాలు [Vruschika Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
వృశ్చిక రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి అష్టమ స్థానమైన మిథునరాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయము ఆరోగ్యము ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయములు నెరవేరునట్లు ఫలితములనిచ్చును. శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజితమూర్తిగానూ సౌభాగ్యకరముగా ఉండునట్లు గత సంవత్సరంలో అనుభవించిన పాట్లు తొలగునట్లునూ జీవతాశయసిద్ధి కల్గు సత్ఫలితములనిచ్చును. రాహుకేతువులు వరుసగా మే 18నుండి వత్సరమంతా చతుర్ధ, దశమ స్థానములందు తామ్రమూర్తిగా ఈసమయానికి ఉద్యోగం స్వల్పప్రయత్నంతో పొందుట లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నములో కృత కృత్యులగుట జరుగును.
వృశ్చికరాశి జాతకులకు ధనపంచమాధిపతి 8ట గురు సంచారం అనుకూల మైనదికాదు, వత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం కొంతకాలం దైన్యమైన పరిస్థితిని అనుభవించి తిరిగి పొందుతారు. పనిచేసేచోట కొంత ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అక్టోబర్లో . భాగ్యస్థాన సంచారం నిలచిన అన్ని పనుల్లో విజయాన్ని తెస్తుంది. అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్లో సంపదను సుస్థిరం చేసుకోవడం, వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. కోర్టు సంబంధించిన ప్రతిబంధకములు ఎదురవుతాయి. లక్ష్మి నరసింహస్వామి వారికి అభిషేక అర్చనాదులు చేయడం వలన సమస్యల నుండి బయటపడుటకు అవకాశం ఉంది. గురుడు అష్టమ స్థానం సంచారం సానుకూల వాతావరణాన్ని అదృష్టాన్ని ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతమేరకు ఆందోళన ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకుని పురోగమించ గల్గుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంత మేరకు ప్రయోజనాన్నిస్తాయి. సత్కళత్రాన్ని పొందుతారు. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంవదను పొందగల్గుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు.
ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతీ విషయాన్నీ లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి, మంచితనాన్ని పెంపొందింప జేస్తారు. మీవిషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించగల్గుతారు. రు. మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతలను సవాళ్లను అధిగమించి అన్నిటా జయం కలుగుతుంది.
రాహు సంచారం ప్రభావం వలన ఛాతీ ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు లోనవుతుంది. వృశ్చికరాశి వారికి, కేతువు దశమస్థానంలో యుండుట వలన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ అభిమానాలు వెల్లివిరుస్తాయి. ఆనందం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉంటుంది. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన మిమ్ములను అడ్డంకులను తొలగించి ప్రతిబంధాకలనుంచి కాపాడి ప్రగతి పథంలో ఉంచుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్: శుభకార్యపరంపరలు, గృహమున కళ్యాణాది శుభకార్య నిర్వహణ, బంధుమిత్రుల హర్ష కరతాళధ్వనుల మధ్య ఉత్సవ వాతావరణం ఏర్పడుతుంది.
- మే:ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమేరకు అస్థిమితం అసౌకర్యంగా ఉండటం మిమ్ములను ఇబ్బంది పెడుతుంది.
- జూన్: ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ, సమాజంలో గౌరవం, అధికారం. మీ సలహా కోసం ప్రజలు వేచి చూస్తారు. సంప్రదాయ పరిరక్షకులుగా కీర్తింప బడతారు.
- జూలై:గౌరవ సన్మానాలు పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. సంప్రదాయ వాదులుగా మీకు గుర్తింపు వస్తుంది. ఆలయ ట్రస్టు బోర్డుల్లో మీకు సభ్యత్వం అవకాశం ఉంది. నామినేటెడ్ పదవి మిమ్ములను వరిస్తుంది.
- ఆగష్టు : ఉపాసనాబలం పెరుగుతుంది. నమ్మకాలు, ఆధ్యాత్మికత మొదలైన విషయాలపై ఆసక్తి, జ్ఞానపిపాశ మీకు ఉంటుంది. అందరికీ ప్రోత్సాహం అందచేస్తారు.
- సెప్టెంబర్:చైతన్యవంతంగా, ఏ విధంగానైనా పోటీ ఎదుర్కొనేలా దృఢంగా ఉంటారు. ఇన్ఫెక్షన్సు, జ్వరం, మలేరియా వంటి రుగ్మతల వలన బాధపడేలా ఉంటుంది.
- అక్టోబర్ : మీరు పనిచేసే చోట లేక కార్యాలయంలో అగ్నిప్రమాదాలు లేదా ప్రమాదాలు సంభవించే విధంగా పరిస్థితులుంటాయి. శారీరకంగా కష్టపడి పనిచేస్తారు, తరచుగా వివాదాలలో మునిగిపోవడం తప్పదు.
- నవంబర్: శక్తివంతమైన మరియు చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని పురోగమిస్తారు. ఇతరులను నియంత్రించే ధోరణితో దూకుడుగా వ్యవహరిస్తారు. ముఖంపై వల్లటి మచ్చలు లేదా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశముంది.
- డిసెంబర్ : వాస్తవాలను భిన్న కోణాలనుంచి రాబట్టి సత్యాన్వేషణ చేస్తారు. వేర్చుకోవాలనే తపన తీవ్రంగా ఉంటుంది. ఇతర దేశ ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. శీతల ప్రాంతాలను సందర్శిస్తారు.
- 2026 జనవరి : తలపెట్టిమలు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
- ఫిబ్రవరి : ఈ మాసంలో మీ సంపద మరియు భౌతిక ఆనందాలు మరియు సౌకర్యాలు పెరుగుతాయి. ప్రయత్నాలకు తగిన విజయాన్ని పొందుతారు. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
- మార్చి: ఆరోగ్యవిషయంలో శ్రద్ధ అవసరం. ఎక్కువగా పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఆందోళన చెందే అవకాశం ఉంది.