ఉగాది మీన రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి [Sri Viswavasu Nama Samvatsara Meena Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 5, వ్యయం – 05
- రాజపూజ్యం – 03, అవమానం – 01
ఎవరెవరు మీనరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మీనరాశి లోకి వస్తారు.
- పూర్వాభాద్ర 4వ పాదం (ది)
- ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు(దు, శం, ఝ, థ)
- రేవతి 1,2,3,4 పాదాలు (దే, దో, చ, చి)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మీనరాశి ఫలాలు [Meena Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
మీన రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి అర్ధాష్టమస్థానమందు రజితమూర్తి వంతముచే నూతన గృహనిర్మాణములు చేయువారుగానూ, ఉన్నత విద్యలలో రాణించునట్లుగానూ శని సంవత్సరమంతా జన్మరాశి యందు సువర్ణమూర్తి వంతముచే విచక్షణాధికారము గల ఉన్నత ఉద్యోగము, సర్వసౌఖ్యములు పొందునట్లునూ, రాహుకేతువులు వరుసగా మే 18నుండి సంవత్సరమంతా వ్యయ, షష్ఠ స్థానములందు సువర్ణమూర్తులుగనూ ఉత్తమ ఫలితములిచ్చును.
ఈ సంవత్సర ఆరంభంలో వీరు ఆర్థిక శారీరిక మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితా లుంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం అవగాహన లోపం వలన కుటుంబపరమైన సమస్యలను ఒత్తిడులను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ప్రతీ పనిని పూర్తి శ్రద్ధతోచేస్తారు. అయితే, మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు మే నెలాఖరు నాటికి స్థాన చలనం కలుగుతుంది. అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన పంచమ స్థానసంచారంలో ఉన్నప్పుడూ సంతానానికి, ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అవగాహనలోపం వలన డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఎదురీదే పరిస్థితి. అయితే అన్నింటా సర్దుకుని అధిగమిస్తారు.
ఈరాశి వారికి ఏలినాటి శనిప్రభావం ఉన్ననూ క్రమశిక్షణ, నియంత్రణ, సచ్ఛీలతలను ఆచరించడంచే సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగల్గు సత్తాకల్గి కార్యసాధకు లవుతారు. అలాగే సోమరితనం, పమలు వాయిదావేయడం, నిర్లిప్తత కలగటానికి అవకాశం లేకపోలేదు. ఆశావాహంగా లక్ష్యంతో ఉంటే అన్నిటా సాధించగల్గుతారు.
సోదర సోదరీమణులను ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వారితో మీ సంబంధం అంతంతమాత్రంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభం చేకూరుస్తుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం మీకు కలసివస్తుంది. మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు, కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. జూలై-నవంబర్ మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, వైద్య ఖర్చులు పెరగడం, అస్తిమిత పరిస్థితి వృధా ధనవ్యయానికిదారి తీయొచ్చు. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతి దారులు అధిక ధనం సంపాదిస్తారు. షష్ఠ స్థానంలో కేతువు సానుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కల్గుతాయి. రైస్ మిల్లు వ్యాపారులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన పథకాలద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ప్రతి శనివారం ఆంజనేయ ప్రార్ధనలు చేయడం, సుందరకాండ పారాయణ చేయడం వలన ఆశాంతి తగ్గుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య-‘3’.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ మరియు పదిమందిని ప్రోత్సహించి ముందుకు నడిపించే సామర్థ్యముంటుంది. ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండదు.
- మే: ఆర్థిక స్థితి పెరుగుతుంది. శత్రువులు మీకు హాని చేయలేరు. ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు. సోదరవర్గం నుంచి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంబంధించి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు.
- జూన్: వ్యాపారం అభివృద్ధి, పొరుగువారు, తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందకరమగు సమయాన్ని గడుపుతారు. దాంపత్య జీవనం వికశిస్తుంది.
- జూలై : కీళ్ల నొప్పులు, జ్వరంలాంటి అనారోగ్యానికి వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది మాసంలో మొదటి పక్షం అనుకూలత లేదు. స్థాన చలనం అయ్యి కుటుంబమునకు దూరంగా ఉండి వేరే ప్రాంతాలలో గడపవలసి వస్తుంది.
- ఆగష్టు: సంతానం నుండి శుభవార్తలు. ఆర్ధిక వృద్ధి, సృజానాత్మకంగా ఉండి అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆర్ధిక వృద్ధి కలగవచ్చు.
- సెప్టెంబర్ : ఇల్లులాంటి స్థిరాస్థిని కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.. విద్యా విషయంలో మెరిట్ గుర్తింపు, పోటీ పరీక్షలలో ఉద్యోగ నియామకపు విషయాల్లో ముందంజ వేస్తారు.
- అక్టోబర్ : దైవ కార్యాల్లో పాల్గొవి తనవంతు సహాయం చేస్తారు. అష్టమ రాశిలో కుజ సంచార ప్రభావం అధిగమించుటకు ప్రతి మంగళవారం ఋణ విమోచక అంగారక స్తోత్రం చదవాలి.
- నవంబర్: చలివాతావరణం గొంతు నొప్పి, ఆస్థమా వంటి కంఠ శ్వాసకోశ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు జాగ్రత్త వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించకోవచ్చు.
- డిసెంబర్: వృత్తి ఉద్యోగ విద్యా విషయాల్లో సృజనాత్మకతతో ప్రతీ పనిని సులువుగా చేయగల్గుతారు. ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు. మనోవికాసం కల్గుతుంది.
- 2026 జనవరి : సమస్త దోషాలు తొలగి సకలైశ్వర్యాలు మిమ్ములను వరిస్తాయి. ధవాదాయం బాగా పెరుగుతుంది. అన్ని రకాల సమస్యలను అధిగమిస్తారు. ఆర్ధిక వృద్ధి కల్గుతుంది.
- ఫిబ్రవరి : పట్టినదల్లా బంగారమవుతుంది. మూడు పువ్వులు ఆరుకాయలు చందంగా మీకు అన్నీ అనుకూలమవుతాయి. వ్యవహారాజయం పొందుతారు. ఆరోగ్యం వికసిస్తుంది.
- మార్చి: నిర్లిప్తత మరియు నిస్తేజం ఆవహిస్తుంది. తలనొప్పి లేక గొంతునొప్పి ప్రయాణానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేయాలి. ఖర్చులు గణవీయంగా పెరుగుతాయి.