అక్షయ తృతీయ రోజున ఏయే పనులను చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. వంశవృద్ది కలుగుతుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుణ్యమును అపార ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే అంశములన్నింటిని తెలుసుకొందాం…
అక్షయ తృతీయ వైశాఖ మాసం లో వస్తుంది. శ్రీమన్నారాయణుడికి ప్రితికరమైన మాసములలో వైశాఖమాసం ఒకటి. అందుచేతనే ఈ మాసమును మాధవమాసము అంటారు. అక్షయ తృతీయ రోజు నదీస్నానం / సాగరస్నానం శ్రేయస్కరం. అక్షయ తృతీయ రోజున ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకు చందనంపూసి షోడశోపచారములతో పూజచేస్తారో వారికి విశేషమైన ఫలితము కలుగును.
శ్లోకము:
యః కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం |
వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరమ్ ||
ఈ రోజున నారాయణునికి చందన లేపనం చేయడం వల్ల, విష్ణుమందిరవాసం లభిస్తుందని స్కాంద పురాణంలో రాజర్షి అంబరీషునికి నారదుడు వివరీంచినట్టు పేర్కొనబడింది. సింహాచల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీవరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం చేస్తారు.
అక్షయ తృతీయ కృతయుగాది. అందుచేత ఈ రోజున పిండములు లేకుండా పితృదేవతారాదన చేయుటవలనా లేదా తిల తండుల తర్పణను చేస్తారో వారికీ వంశవృద్ధి కలుగుతుంది.
అక్షయ తృతీయ రోజున ఉదకుంభదానము చేయాలి. అంటే మట్టితో కానీ, కంచు/రాగితో కాని చేసిన ఒక పాత్ర తీసుకోని, దాని నిండా మంచి నిరు పోసి, ఒక తులసి దళం, తెల్లటి పుష్పం అందులో వేసి శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా ఇచ్చే దానమును ఉదకుంభదానము అంటారు. యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఒక చెప్పుల జత, ఒక గొడుగు, తాటాకు విసినకర్ర ఉద కుంభదానముతో ఇచ్చిన యెడల వారికి విశేషమైన ఫలితము కలుగును. శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా పానకం, చనివిడి, వడపప్పులు నివేదన చేయడం కూడా మంచిది.
అక్షయ తృతీయ రోజు నాడే బదరీ నారాయణుడి ఆలయ తలుపులు తెరుచుకొంటాయి. అంతే కాకా మంచుతో కప్పబడిన హృషీకేష్ ఈ రోజు నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది.
ఈ రోజు శ్రీమహాలక్ష్మిని పసుపు -కుంకుమలతో పూజించినచో ఐశ్వర్యం విశేషంగా కలుగుతుంది. బంగారం కొంటేనే ఐశ్వర్యం వస్తుందని ఎక్కడా పురాణ ప్రస్తావన లేదు. అక్షయం అంటే నాశనం లేనిది, ఎప్పటికి తరగనిది. అది ఐశ్వర్యం కాదు. మనం చేసే పుణ్యము మాత్రమే. ఇన్వెస్ట్ మెంట్లు, పెట్టుబడులు, భూములు కొనడములు, బంగారం కొనుగోలు చేయుట తద్వారా వచ్చే లాభాలను ఆశించేవి అక్షయ తృతీయ రోజున చేసేవి కాదు. ఎందుచేతననగా…
శ్లోకము:
వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా |
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా ||
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని,పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు.
అక్షయ తృతీయ రోజున శ్రీమన్నారాయణుడిని పూజించుట, బ్రాహ్మణుడికి ఒక చెప్పుల జత, ఒక గొడుగు, తాటాకు విసినకర్ర ఉద కుంభదానము మొదలైనవి చేసి అట్టి పుణ్య ఫలాన్ని అక్షయముగా పొందుతారని, ఈ అక్షయ తృతీయ రోజున మీకు సర్వే సర్వత్రా శుభములు చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించడమైనది.
సేకరణ: https://www.panditforpooja.com/blog/things-to-do-on-akshaya-tritiya/
1 Comment. Leave new
Pranamam,
Very informative article on “Akshaya Tritiya” in telugu.