సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం
స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు, ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తీసివేయగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, చందన లేపనం తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. ప్రసాదంగా స్వామీ నుంచీ తీసిన గంధం, అనగా చందనం ప్రసాదం ముఖాన పెట్టుకొని కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని నమ్మకం.
సింహాచల చందనోత్సవం – నిజరూప దర్శనం ఎప్పుడు
ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి దేవుడి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి ఆ రూపాన్ని మదిలో నిలుపుకుని వెనుదిరుగుతారు భక్తులు. ప్రత్యేక సందర్భాల్లో ఆ మూర్తి అలంకరణలో భిన్నత్వం మినహా మిగతా సమయాల్లో దేవతా విగ్రహరూపం ఒకేలా ఉంటుంది. కానీ సింహాచలం కొండల్లో వెలసిన వరాహ నరసింహ మూర్తిని దర్శించుకోవాలంటే ఏడాది మొత్తంలో ఒకే ఒక్క రోజు వీలవుతుంది. మిగతా రోజుల్లో చందనలేపనంలో మునిగిపోయే అప్పన్న ఈ ఏడాది మే 10 వ తేదీన నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు. ఎటుచూసినా శ్రీచందన పరిమళాలూ సంపెంగల సౌరభాల్లాంటి ఎన్నో ప్రకృతి రమణీయతలతో విరాజిల్లే క్షేత్రం సింహాచలం. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే.