సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం – క్షేత్ర మహాత్యం
విశాఖపట్టణం మహానగరంలోని సింహాచలం ప్రాంతం నగరనడిబొడ్డునుండి సుమారుగా 11 కిలోమీటర్ల దూరంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం [Simhachalam Lakshmi Narasimha Swamy Temple] తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న పరమ పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి స్వామి వారు వరాహరూపునిగా భక్తులకు దర్శనమిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ, నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా ఉండటం ఈ క్షేత్ర విశేషం. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారు సింహాద్రి అప్పన్నగా కూడా పిలువబడుతున్నారు. ఈ ప్రముఖ దేవాలయం సింహగిరి పర్వతంపై సముద్రమట్టానికి సుమారు 244 మీటర్ల ఎత్తున ఉన్నది.
తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన మరియు దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. సంవత్సరం అంతా చందనంతో కప్పబడి, కేవలం ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు అనగా అక్షయతృతీయ రోజున 12 గంటలు మాత్రమే లక్ష్మీనరసింహ స్వామి వారు తన నిజరూప దర్శనాన్ని భక్తులకు ఇస్తారు. ఈ నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
మూలవిరాట్టు
ఈ క్షేత్రం లో మూలవిరాట్టు ‘వరాహనరసింహ’, ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. గర్భాలయంలో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ప్రతి సంవత్సరం ఒక్క వైశాఖశుద్ధ తృతీయ అనగా అక్షయ తదియ రోజు మాత్రమే కొన్ని గంటలసేపు స్వామివారిపై ఉన్న చందన పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఈ సందర్భంలో మాత్రమే స్వామి వారు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూల విరాట్టు కు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాలలో ఊరేగిస్తారు. ‘గంగధార’కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక, త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది. హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.