సింహాచలంలో చందనోత్సవం ఎలా చేస్తారు – చందన ప్రసాదం ఫలితాలు

Loading

Simhachalam_Chandanotsavam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రీ వరాహ నారసింహ స్వామి “ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదునీ రక్షించిప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం” అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడి స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరుపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత.

శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం ||

అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలములిస్తాయి. ఈ అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలదము.

 సింహాచలం వార్షిక చందనోత్సవం…

విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు… హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయ తృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది.

సింహాద్రి అప్పనకు చందనోత్సవం ఎలా చేస్తారు?

నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచీ ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలుపెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది. రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలూ సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారుచేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.

ఎన్నిసార్లు లక్ష్మీ నరసింహ స్వామికి చందనం పూస్తారు?

సింహాచలం లో వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళల నుంచి కొనుగోలు చేస్తారు.

  • మొదట అక్షయ తృతీయనాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు.
  • ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు అయిదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట.

చందన ప్రసాదం – ఫలితాలు

చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.