సింహాద్రి అప్పన్న ఆలయ క్షేత్ర స్థలపురాణం – అంతరాలయ వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో సింహాద్రి అప్పన్న ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం, స్వామి వారు వరాహ లక్ష్మీనరసింహ స్వామి గా దర్శనమిస్తారు. అయితే పరమ పవిత్రమైనటువంటి ఈ సింహాచల ఆలయ చరిత్రను ఆధారాలతో పాటుగా పదకొండవ శతాబ్దం వరకు చూడవచ్చు. అయితే పురాణ అంతర్భాగంగా చూసిన యెడల, శ్రీమహావిష్ణువు యొక్క 10 అవతారాలలో అనగా దశావతారాలలో నాలుగవ అవతారమైనటువంటి నరసింహ స్వరూపముగా స్వామి వారు ఇక్కడ కొలువై ఉండడం జరిగింది. పురాణ ఇతిహాసాలను బట్టి, రాక్షస రాజైనటువంటి హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువుకు బద్ధ శత్రువు. అయితే తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క పుట్టుక వల్ల హిరణ్యకశిపునికి ప్రాణహాని ఉంది అని తను గమనించలేదు. హిరణ్యకశిపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మతః శ్రీమహావిష్ణువు యొక్క భక్తుడు. హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రయత్నం చేసిన గురువుల ద్వారా చెప్పించినా శ్రీమహావిష్ణువు యొక్క విముఖతను చేయడంలో విఫలమయ్యాడు. చివరికి ప్రహ్లాదుని చంపించే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ అనేక సందర్భాలలో భక్త ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువును స్తోత్రము చేయడం ద్వారా శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుని రక్షిస్తారు. ఈ విషయాల వల్ల చికాకు పొందిన హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదులతో శ్రీమహావిష్ణువు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అని చెబుతున్నావు కదా ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు? అని ప్రశ్న వేయగా దానికి ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువును స్తోత్రం చేసిన ఉత్తర క్షణమే స్తంభం నుంచి శ్రీమహావిష్ణువు నరసింహ స్వరూపంగా అవతరించి హిరణ్యకశిపుని సంహరించి పరహలాదుల్ని రక్షిస్తాడు.
ఈ ఆలయం యొక్క స్థల పురాణము ప్రకారము మొట్టమొదటిసారిగా ప్రహ్లాదుడు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారిని విగ్రహరూపంలో ఆరాధన చేశాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే మహారాజు తన యొక్క విమానం మీద వెళుతుండగా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క ఆలయానికి ఆ విమానం ఆకర్షించబడి కిందకు దిగుతుంది. అతడికి పుట్టతో కప్పబడినటువంటి వరాహ నరసింహస్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది, అయితే ఆ విగ్రహాన్ని సంవత్సర కాలమంతా చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియనాడు అనగా అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయమని అశరీరవాణి పురూరవునికి చెబుతుంది. ఆ ఆకాశవాణి పలుకుల మేరకు ఆ మహారాజు వరాహ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి వైశాఖ శుద్ధ తృతీయనాడు అనగా అక్షయ తదియ రోజు నాడు స్వామివారి చందనమును ఒలిచి నిజరూప దర్శనమును కలిగించి, తిరిగి వేడిని తగ్గించడానికి సంవత్సరం అంతా చందనంతో కప్పి ఉంచి, లింగాకారంగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే చందనము తీసిన రోజు నాడు స్వామి వారు త్రిబంగి స్వరూపంలో అనగా, వరాహము తల తోటి, సింహం తోక కలిగిన మానవ శరీరంతో స్వామివారి దర్శనం ఇస్తారు. మిగిలిన సంవత్సరం అంతా కూడా చంద్రంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారు నిత్య రూప దర్శనం ఉంటుంది.
సింహాచలం అంతరాలయ వివరాలు:
గాలి గోపురం-సింహ ద్వారం
ప్రతి దేవాలయంలో ప్రధాన ద్వారము అనగా ముఖ ద్వారం లేదా ప్రధాన గోపురం తూర్పు వైపుగా ఉంటుంది. కానీ సింహాచల మహా క్షేత్రంలో పడమర వైపుగా ముఖద్వారం ఉంటుంది. తూర్పు సింహద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంటే పడమర సింహ ద్వారం విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రధాన విశ్వాసం. అంతేకాకుండా సింహాచలం కొండ మీద నుంచి గాలిగోపురం ముఖద్వారం వరకు ఆలయాన్ని చేరుకోవడానికి సుమారుగా 41 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
సింహాచలం యొక్క దేవాలయం గర్భగుడికి ఎదురుగా ఉండేటువంటి ప్రాంగణంలో కప్ప స్తంభం ఉన్నది. ఈ కప్పస్తంభం సంతాన గోపాల మహాయంత్రంపై ప్రతిష్టించబడి ఉన్నది. సంతానం లేనివారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే, సంతానం కలుగుతుందని ప్రధానమైనటువంటి విశ్వాసం. అయితే సింహాచలంలో స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లిస్తారు అనగా పన్నులు చెల్లిస్తారు కనుక దీనిని కప్పపు స్తంభం అని పిలిచేవారు. కాలక్రమేణా అది కప్పస్తంభం గా మారింది. ఈ స్తంభాన్ని కౌగిలించుకున్న లేదా స్తంభంతో పాటుగా ఒక వస్త్రాన్ని చుట్టి శరీరానికి బంధనం చేసి స్వామివారికి ప్రార్థన చేసిన తప్పక సంతానం కలుగుతుంది అని, ఇది అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు.
జల ధారలు
సింహాచల క్షేత్రంలో, సింహాచలం కొండల మధ్యలో భగవంతుని ఆలయం ఉన్నది. దీనిని సింహగిరి అని పిలుస్తారు. ఇది జల సమృద్ధి గల ప్రాంతం, అయితే ఈ కొండలపై సహజసిద్ధమైనటువంటి జల ధారలు ఉన్నాయి. వీటిని గంగధర, చక్రధార, ఆకాశ ధార, మాధవధారులు గా పిలుస్తారు. భక్తులు ఈ జల ధారణలో స్నానాలు చేసి దైవదర్శనం చేయడానికి, అదే విధంగా తలనీలాలు సమర్పించుకున్నటువంటి భక్తులు సమీపంలో గంగ ధారల్లో స్నానం చేసి దేవదర్శనానికి వెళుతూ ఉంటారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజంగా ఏర్పడిన ఒక సెలయేరు ఉన్నది. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణానంతరము ఈ ఘట్టంలో స్నానాన్ని ఆచరిస్తారు, ఈ దారపై యోగ నరసింహ స్వామి వారి యొక్క విగ్రహం ఉన్నది.
భైరవ వాక
సింహాచల క్షేత్రంలో భైరవాక అనేటువంటి ప్రాంతము మెట్ల మార్గం ద్వారా కొండమీద ఎక్కేటప్పుడు కనిపిస్తుంది. ఆడివివరం అనే గ్రామంలో ఈ భైరవ వాకకు సంబంధించిన భైరవద్వారం ఉంటుంది. ఇక్కడ భైరవ స్వామి వారు కొలువై ఉంటారు కానీ ఎటువంటి పూజలు ఈయన అందుకోరు. సుమారుగా 13 నుంచి 16 వ శతాబ్దాల మధ్య ఈ భైరవపురం భైరవ వాక గా ప్రాముఖ్యతను పొందినది.
కొత్త విచారణ కార్యాలయం
భక్తుల సంరక్షణార్థం అదేవిధంగా వారికి సులభంగా సమాచారాన్ని అందించడానికి కొత్తగా విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రం ద్వారా భక్తులు దైవదర్శనానికి సంబంధించిన సమాచారాన్ని గిరిప్రదక్షిణానికి సంబంధించిన సమాచారాన్ని అలాగే సులభంగా కాటేజీలు బుక్ చేసుకోవడానికి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు
వరాహ పుష్కరిణి
సింహాచల క్షేత్రంలో సింహగిరి కొండ కింద ఆడవివరం అనే గ్రామంలో వరాహ పుష్కరిణి ఉన్నది. సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం నాడు స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకుని వచ్చి నౌక విహారాన్ని చేయిస్తారు. ఈ వరాహ పుష్కరిణి మధ్యలో ఒక మండపం కూడా ఉన్నది.
మాధవధార
మాధవేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సింహాచల క్షేత్రంలో ఉన్నది. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఈ మాధవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా దర్శిస్తారు. ఇక్కడ ఏర్పడినటువంటి జలధారయే ఈ మాధవధార.