- వైకుంఠ ఏకాదశి అని దేనిని అంటారు?
- వైకుంఠ ఏకాదశికి గల వివిధ పేర్లు ఏమిటి?
- ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం వెనుక ఉన్న రహస్యమేమిటి?
- ఈ రోజున విష్ణుమూర్తిని ఏ పూవులతో పూజించాలి?
- శ్రీ మహావిష్ణువుకి ప్రీతిగా ఏయే స్తోత్రములు పఠించడం వలన ఏ ఫలితములు పొందవచ్చు?
- ఏకాదశి వ్రతమును ఆచరించేవారు యే నియమములను పాటించాలి?
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. దీనినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశులలో అత్యంత ప్రధానమైనది.
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి తిధినాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||
భక్తులకు దారిచూపువాడు, సకల భూతములకు నాయకుడు, ఉత్కృష్ణమైన కాంతి గలవాడు, సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు శ్రీమహావిష్ణువు. వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీమహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీమహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం.
అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు.
ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది.
ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన విశేష ఫలితాలను ఇస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదము.
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు అష్టోత్తరము, శ్రీమన్నారాయణ స్తోత్రము, విష్ణుపురాణము, దశావతారములు పారాయణము చేసినచో సకల శ్రేయోభివృద్ధి కలుగును. విష్ణు, వెంకటేశ్వర దేవాలయం దర్శించుకోవడం శుభఫలితాలను పొందవచ్చు. ఆలయాల్లో విష్ణు అష్టోత్తరము వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
ఏకాదశి వ్రతమును ఆచరించేవారు క్రింది నియమములను తప్పక పాటించాలి.
- దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
- ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి.
- విష్ణు, వేంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవాలి.
- అసత్యమాడరాదు.
- స్త్రీ సాంగత్యమునకు దూరంగా ఉండాలి.
- చెడ్డ పనులు, తప్పుడు ఆలోచనలను చేయరాదు.
- ఆ రోజు రాత్రంతా జాగరణము చేయాలి.
- అన్నదానం చేయవలెను.
Satyanarayana Vratam – Telugu
₹3,000.00 – ₹10,000.00
2 Comments. Leave new
Very good information and useful to all devotees
ధన్యవాదములు సుబ్రహ్మణ్యంగారు.