సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ.పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి.
కనుమ పండుగ తమిళనాడులో జరుపుకునే మట్టు పొంగల్‌ను పోలి ఉంటుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఆవులు, ఎద్దులు మరియు ఇతర జంతువులకు ఈ పండుగ అంకితం చేయబడింది. పశువులు, పశువుల కొట్టాలను రోజు శుభ్రం చేస్తారు. ఆవులను బంతిపూలతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంతో ఉంటారు. ఆ రోజు సాయంకాలం పశువులకు పొంగలి నైవేద్యం పెడతారు.
కనుమ నాడు పితృ దేవతలకు ప్రసాదాన్ని పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి భుజించి, అందరూ కలిసి ఒకే చోట ఉండి పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా కనుమనాడు గారెలు, మాంసంతో పెద్దలకు నైవేద్యం పెడతారు. అలాగే ప్రయాణాలు, శుభకార్యాలు చేయడం కనుమనాడు నిషేధం. ఆరోజు ఆయా కుటుంబాలలో గతించిన పెద్దలకు కేటాయించి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాంటివి మరిచిపోయి సరదాగా తిరగడం, షికార్లు చేయడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నారు.