ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమధనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..’ధన త్రయోదశి‘ అన్నారు.
ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ధన త్రయోదశి పండుగను నవంబర్ 10వ తేదీన జరుపుకుంటారు.
ఇక ధన త్రయోదశి పూజ ముహూర్తంగా సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి, రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు నిర్ణయించారు. ఇక ధన త్రయోదశి ప్రదోషకాలం విషయానికి వస్తే సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది.
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి, భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో ఆక్రమించిన రోజు గా ఈ ధన త్రయోదశిగా చెబుతారు. అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని చెరనుంచి విముక్తి చేసి, శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజే.
ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి‘.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు‘.
అందుకే, ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు . కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.