సర్వ సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం చేయించిన రోజు నుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. బియ్యం చంద్రుడికి కారకం. ‘మనః కారకో ఇతి చంద్రః‘ అని. అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యం. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. అందుచేతనే శుబానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది. మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు చాలా ప్రాధాన్యత ఉంది.
అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ‘అక్షతాన్ సమర్పయామి’ అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు. మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది