- సంధ్యావందనం అంటే ఏమిటి?
- సంధ్యావందనాన్ని ఆచరించడానికి సరైన సమయమేమిటి?
- ఏ సమయాలలో ఏ దిక్కులకి తిరిగి సంధ్యావందనం చేయాలి?
- సంధ్యావందనం చేయడము కుదరకపోతే / వయస్సు పైబడిన వారు ఏమి చేయాలి?
- సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుంది?
సంధ్యావందనం అంటే ఏమిటి?
ఉపనయనం అయిన ప్రతీ వ్యక్తి చేయవలసిన నిత్య కర్మలలో సంధ్యావందనం చాలా ప్రదానమైనది. పగలు, రాత్రుల నడుమ వచ్చే సంధి కాలము నాడు చేయవలసిన కార్యక్రమం కాబట్టి దీన్ని సంధ్యావందనం అని అంటారు. సంధ్యావందనం చేయకుండా ఇతర కర్మలను చేయకూడాదు.
సంధ్యావందనాన్ని ఆచరించడానికి సరైన సమయమేమిటి?
సాదారణంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం… ఈ మూడు సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చేయాలి. సంధికాలంలో గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలకు అర్ఘ్యంను సమర్పించాలి. ఉదయం విష్ణుస్వరూపిణిగా, మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగా, సాయంత్రం శివస్వరూపిణిగా గాయత్రిని ధ్యానించాలి. గాయత్రిని అనుష్ఠానం చేయకుండా ఏ ఇతర మంత్రాలను జపించినా అవి ఫలితాన్ని ఇవ్వవు. సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, మరియు గాయత్రీ జపం సంధ్యావందనంలో ప్రధాన అంశాలు.
సంధ్యా వందనం రోజుకు మూడుసార్లు చేయాలి. రోజులో మొదటిసారి సంధ్యా వందనం తెల్లఝామున నక్షత్రాలు ఉన్నపుడు చెయ్యాలి. నక్షత్రాలు లేకుండా చేయటం మధ్యమం. సాదారణంగా సూర్యోదయమైన తర్వాత చేయడం మంచిదికాదు. కానీ సూర్యోదయమైన తరువాత సంధ్యావందనం చేయడం మనకి ఆచారంగా వస్తోంది. రెండోసారి మాధ్యాహ్నిక సంధ్యావందనాన్ని సూర్యోదయమైన 12 ఘడియలు తర్వాత చేయడం మంచిది. సాయంకాల సంధ్యావందనం సూర్యుడు అస్తమిస్తుండగా, నక్షత్ర దర్శనం కాకుండా చెయ్యాలి.
సంధ్యావందనం చేయడము కుదరకపోతే / వయస్సు పైబడిన వారు ఏమి చేయాలి?
పురుడు, మైల సమయాల్లో సంధ్యావందనం చేయరాదు. ఆ సమయాలలో మనసున సంకల్పించి అర్ఘ్యప్రదానం చేస్తేచాలు. ప్రయాణాల్లో వీలుపడకపోతే మానసిక సంధ్యావందనం చేయుటలో దోషము లేదు. ప్రాతః స్నానం చేసిన తరువాతే సంధ్య వార్చాలి.
శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం కనుక వయస్సు పైబడిన వారు, వయోవృద్ధులు పండ్లను స్వీకరించి సంధ్యను పూర్తి చేయవచ్చు. వీలు అయినంత త్వరగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సంకల్పం చేసి . యధాశక్తిగా గాయత్రీ జపమును చేసుకొనవచ్చును.
ఏ సమయాలలో ఏ దిక్కులకి తిరిగి సంధ్యావందనం చేయాలి?
ఉదయం ఈశాన్య దిక్కుగా, సాయంకాలం వాయువ్య దిశగా, మధ్యాహ్నం తూర్పు దిక్కుగా తిరిగి సంధ్య వార్చాలి. సరైన కాలంలో సంధ్య వార్చితే 10 మార్లు గాయత్రి జపం చేస్తే చాలు. సమయం తప్పితే 108 మార్లు చేయాలి.
సంధ్యావందనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు సంపాదించి ఇచ్చిన వంశ పరంపరాగతమైన నిక్షేపం. ఇతర జపాలేవి చేసినా, చేయక పోయినా, గాయత్రి జపించిన వాడు భూతదయ గలవాడిగాను, బ్రాహ్మణుడి గాను పిలవడటానికి అర్హుడవుతాడు.
సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుంది?
బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే, గొప్ప కీడు కలుగుతుందని అనేక స్మృతులలో ఉంది. కీడు కలుగుతుంది అంటే, ధన నష్టం-ధాన్య నష్టం అని మాత్రమే కాదు. అట్టి వాడికి మరు జన్మలో హీన జాతులయందు పుట్టుక కలుగుతుందని అర్థం. ఎన్ని జన్మాల పుణ్య ఫలంగానో సంపాదించిన బ్రాహ్మణ్యం, సోమరితనం వల్ల కోల్పోయి, హీన జాతులయందు పుట్టడానికి దారితీయడం కంటే మించిన కీడు ఏముంటుంది? సంధ్య వార్చని బ్రాహ్మణుడు చండాలుడితో సమానమై, భ్రష్ట బ్రాహ్మణుడిగా లోకం దూషిస్తుంది. సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే!
సేకరణ: https://www.panditforpooja.com/blog/significance-and-importance-of-sandhyavandanam/