- చండీ (దుర్గా) సప్తశతీ అంటే ఏమిటి?
- ఆయుత చండీ యాగం అంటే ఏమిటి?
- చండీ పారాయణని ఎవరు చేయాలి?
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీ యాగంలో మంటలు ఎందుకు చెలరేగాయి?
- ఆయుత చండీ యాగంలో మంటలు శుభమా? అశుభమా?
చండీ (దుర్గా) సప్తశతీ అంటే ఏమిటి?
చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18 పురాణాలు రాసి, ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల గొప్పతనాన్ని వివరిస్తూ కీర్తించారు. స్వారోచిష మన్వంతర సమయమందు వ్యాసుడు రచించిన మార్కండేయ పురాణంలో ఒక భాగమే ఈ చండీ సప్తశతీ.
సప్త అంటే 7. శతీ అంటే 100. కనుక చండీ (దుర్గా) సప్తశతీ అంటే ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. మిగిలిన స్తోత్రాల కంటే ఇది చాలా విశేషమైంది. ఎందుకంటే… మహిషాసురుడు, శుంభ నిశుంభులు, ధూమ్రలోచనుడు, చండ ముండులు, రక్తబీజుడు వంటి వివిధ రాక్షసులను చండీ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి రూపములలో సంహరించింది ఈ స్తోత్ర రూపంలోనే.
మిగిలిన స్తోత్రాలన్నీ పఠించి, అనుష్టానం చేస్తే ఫలితాలని ఇస్తాయి. కానీ.. .చండీ మాతకు ప్రీతిగా నవాక్షరీ మంత్రాన్ని లేదా చండీ స్తోత్రాన్ని పఠించినా, హోమము చేసిన వెంటనే ఫలితం వస్తుందన్నది నమ్మకం.
ఆయుత చండీ యాగం అంటే ఏమిటి?
యజుర్వేద సంహిత ఆధారంగా ఆయుతం అంటే సంస్కృతంలో పదివేలు. పదివేల చండీ (దుర్గా) సప్తశతీ పారాయణాలను పూర్తి చేసి, అందులో దశాంశవంతు అంటే పదోవంతు వేయిసార్లు నామాలతో హోమం చేసి, పూర్ణాహుతులను సమర్పిస్తారు. ఈ మహాక్రతువునే ఆయుత చండీయాగం అని అంటారు.
నవాక్షరీ మంత్రంను గురుముఖంగా ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే చండీ పారాయణ చేయాలి.
దీన్ని ప్రతి రుత్వికుడు తొలి రోజు 4వేలు, రెండో రోజు 3 వేలు, మూడో రోజు 2వేలు, నాలుగురోజు వెయ్యి చొప్పున మూలమంత్ర పారాయణ చేస్తారు.
తద్వారా… యాగం పూర్తయ్యే సరికి మొత్తం కోటి జపం పూర్తి అవుతుంది. ప్రతి రుత్వికుడు చండీపారాయణాన్ని తొలిరోజు ఒకసారి ప్రారంభించి, నాలుగు రోజులు గడిచేసరికి పదిసార్లు పూర్తి చేస్తారు.
చివరి రోజు మహాచండీకి ప్రీతిగా అగ్నిహోత్రునికి పూర్ణాహుతిని సమర్పించి యాగమును పూర్తి చేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీ యాగంలో మంటలు ఎందుకు చెలరేగాయి?
నాలుగవ రోజు సప్తశతి హోమం పూర్తయిన తర్వాత పూర్ణాహుతికి ముందు కాసేపు విరామం ప్రకటించారు. రుత్విక్కులంతా వారి సామాన్లు సర్దుకొని బయటకు బయలుదేరుతున్న సమయంలో హోమగుండాల వద్ద మిగిలిన ఆవు నెయ్యిని కొందరు బ్రాహ్మణులు ఒక బకెట్‌లో పోసి పూర్ణాహుతి కోసం పక్కనపెట్టారు. యాగశాలకి ఆగ్నేయం దిక్కున ఉన్న హోమగుండం పక్కన ఉన్న బకెట్‌లో నెయ్యిని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి యజ్ఞగుండంలో కుమ్మరించడంతో హోమగుండం నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగి రెల్లు గడ్డితో చేసిన యాగశాల పైకప్పుకు అంటుకుంది.
ఆయుత చండీ యాగంలో మంటలు శుభమా? అశుభమా?
నాలుగవ రోజు ఆయుత చండీ యాగంలో, యాగశాలయందు చెలరేగిన మంటలు శుభశూచికమా? అశుభమా? అని చాలా మందికి అనుమానంగా ఉంది. అభిజిత్ లగ్నంలో శాస్త్ర ప్రకారం చూస్తే, మంటలు చెలరేగి పాకలు దగ్ధమవడం అశుభంగా భావించరాదు. ఎందుచేతనంటే… యజ్ఞం పూర్తి అయిన తర్వాత యాగశాలలోని పాకలను కాల్చేస్తారని, అరిష్టంకాదని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వివరించారు. పూర్ణాహుతికి ముందే అమ్మవారు అనుగ్రహించి పూర్ణహుతి చేసిందని, లోకకళ్యాణం కోసం ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా ఈ యాగాన్ని కేసీఆర్ నిర్వహించారని అభినందించారు.