బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః |
సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమి గా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్య తిధి ఈ రోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యతిధిన జన్మించుట వలన దీనిని సూర్యజయంతి గా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ద సప్తమిని, ‘సూర్యసప్తమి‘, ‘అచలాసప్తమి‘, ‘మహాసప్తమి‘, ‘సప్తసప్తి సప్తమి‘ అని అనేక పేర్లతో జరుపుకొంటారు.
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ |
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్ ||
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పనాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.
రథ సప్తమి రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన అర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని…
సప్త సప్త మహా సప్త సప్త ద్విపా వసుంధర|
సప్త జన్మ కృతం పాపం మకరే హన్తి సప్తమి|| అను శ్లోకము చెప్పుకొంటూ స్నానము చేయుటవలన మంచి ఫలితములు కలుగును.
‘సూర్యునికి అర్కః అని పేరు’. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది.
రథసప్తమి రోజున స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు:
స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల-పుష్పాదులను సేకరించి, సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలుగా అయినవి తెచ్చి తులసికోట వద్ద సూర్యభగవానుని ప్రతిమ/పటమును పూజించాలి. సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవుపాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సుర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటివరకు ప్రగాఢ విశ్వాసం
ఈరోజు ఖగోళ పరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది.
ఈ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు,తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. జన్మ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఈ రోజున సూర్యనారాయణుని పూజించుట వలన నశించును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/ratha-saptami/