హిందూ పురాణాల ప్రకారం, పరశురాముని జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ తిథి నాడే పరశురాముడు జన్మించాడు. ఇదే రోజున దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను కూడా జరుపుకుంటారు. మరోవైపు ఈసారి ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కూడా ఇదే రోజున రావడం విశేషం.
పరశురాముని జయంతి పూజ.. పరశురాముని జయంతి, అక్షయ తృతీయ రోజున భక్తులందరూ సూర్యోదయానికి ముందే పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. అనంతరం కొత్త బట్టలు వేసుకుంటారు. జాతక పూజలు చేసి, చందనం, తులసి ఆకులు, కుంకుమ, సామిరాణి, పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఈరోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈరోజున ఉపవాసం ఉన్న వారు కాయధాన్యాలు లేదా తృణధాన్యాలు వంటివి తినకూడదని శాస్త్రాలలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. కేవలం పాల ఉత్పత్తులు మరియు పండ్లను మాత్రమే తీసుకోవాలి.
పరశురాముని కథ.. హరి వంశ పురాణం ప్రకారం, కర్తా విర్య అర్జునుడు రాజు, అతను మహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతను మరియు ఇతర క్షత్రియులు అనేక విధ్వంసక పనులలో పాల్గొన్నారు. దీంతో చాలా మంది అనేక కష్టాలు పడ్డారు. దీంతో బాధపడిన ప్రుథ్వీ క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని, జీవులను కాపాడటానికి విష్ణువు సహాయం కోరారు. అప్పుడు ఆ దేవికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అతనే అర్జునుడిని మరియు క్షత్రియులను వధించి భూమిని, ఇతర ప్రజలను వారి క్రూరత్వం నుండి కాపాడాడు.
పరశురాముని ఆయుధం.. పరశురాముడు కల్కీ అవతారం ఉద్భవించినప్పుడు భువిపైకి వచ్చి అతనికి గురువుగా వ్యవహరిస్తాడని నమ్మకం. పరశురాముడనే పేరుకు ‘పరశు’ అనబడే గొడ్డలిని కలిగి ఉన్న రాముడు అని అర్థం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. పరమశివుడు పరశురాముడికి గొడ్డలిని అందిస్తాడు. పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇస్తాడు.
భూమిని కానుకగా.. క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. ఆ తరువాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు. అయితే, భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు. అందువలన, భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు.