సాధారణంగా గండనక్షత్రములలో శిశు జననమైనప్పుడు, దుష్ట నక్షత్రములందు స్త్రీలు రజస్వలలైనప్పుడు, జరపవలసిన శాంతి 9 విధములు. వీటినే నవవిధ శాంతులు అంటారు, శాంతికిగాను తొమ్మిది పనులు చేయవలెను.
తైలావలోకనం: కంచు, లేదా, మట్టిపాత్రలో తగినంత నల్ల నువ్వుల నూనెపోసి, కచోట ఉప్పు గుట్టగాపోసి – యీ పాత్రను ఉంచాలి. ఆ పాత్రలో ఉన్న తైలంలోని నీడలో గండనక్షత్రములలో జన్మించిన శిశువు, దుష్ట నక్షత్రములందు రజస్వల అయిన స్త్రీ చూడాలి.
రుద్రాభిషేకం: నక్షత్రం యొక్క దోషబలాన్ని బట్టి ఈ కార్యక్రమంజరపాలి. శక్తివంచన లేకుండా ముగ్గురుగాని, అయిదుగురుగాని, 11మందిగాని మహన్యాస పూర్వక ఏకాదస రుద్రన్యాసయుక్తంగా శివాభిషేకము చేయాలి. తదుపరి ఆ బ్రాహ్మణులను భోజన, తాంబూల, దక్షిణలతో సంతోషింపచేసి వారి ఆశీస్సులను బొందవలెను.
సూర్యనమస్కారములు: ఒంటికాలిపై నిలిచి – అరుణమంత్రమును 108 పర్యాయములు జపించుచు చేయు నమస్కారమని పేరు. దీనికి ఒకరుగాని, ముగ్గురుగాని, 5గురుగాని బ్రాహ్మణులను నియుక్తపరచవలెను.
నక్షత్ర జపం: ఏ నక్షత్రంలో అయితే శిశు జననం అయిందో, లేదా రజస్వల అయిందో ఆ నక్షత్రమునకు బ్రాహ్మణులను నియమించి- ఒక్కొక్క నక్షత్రమునకు 108 నుండి 1008 పర్యాయములు శాంతి మంత్రము జపింప చేయవలెను.
మృత్యుంజయ జపము: దీనినే అపమృత్యుపరిహరం అంటారు. యథాశక్తిగా 5, 11 బ్రాహ్మణులను నియమించి – లక్షసార్లు మృత్యుంజయ మంత్రజపం చేయించటం సాంప్రదాయం. తద్వారా అన్నివిధములైన అపమృత్యుదోషాలు తొలగిపోతాయి.
నవగ్రహ జపం: నవగ్రహములకు 9మంది విప్రులచే ఆయా శాంతి నిర్ణీత మంత్రములను జపింపచేయవలెను.
హోమము: ఏ నక్షత్రంలో అయితే శిశు జననం అయిందో, లేదా రజస్వల అయిందో a నక్షత్రానికి, అపమృత్యు దోష నివారణకు మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమములు(అగ్ని పూర్వకంగా) చేయింపవలెను.
సువాసినీ పూజ: శక్తిననుసరించి, తగినంత మంది ముత్తైదువలకు భోజన తాంబూలాదులిచ్చి, పువ్వులు పండ్లను సమర్పించి, నమస్కరించి వారి ఆశీస్సులు పొందవలెను.
ఈ ఎనిమిది అనంతరము – తగుమంది బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. దానగ్రహీతమైన బ్రాహ్మణుడు అనంతరము స్నానము, జపము తప్పక ఆచరించవలెను. గ్రహింపవలెను.
ఈ తొమ్మిది అంగములతో చేసినదే -శాంతి యనబడును. తద్వారా సర్వనక్షత్ర, గ్రహదోషములు – అపమత్యు భయములు తొలగి సుఖశాంతులు లభించును. ఈ శాంతి కార్యములు ఇంటి పురోహితులను (స్థానిక బ్రహ్మను) సంప్రదించి జరిపించుకోవలెను.
కాలానుగుణాన్ని బట్టి ఈ నవవిధ శాంతులు చేయలేని వారు, కనీసం బారసాల సందర్భంలో తైలావలోకనం తప్పనిసరిగా చేయించి, దోషమున్నవారు(మాతా, పిత, మేనమామ) తైలం లో నీడను చూడటం చేయాలి.
దుష్ట నక్షత్రములందు స్త్రీలు రజస్వలలైనప్పుడు కూడా తప్పనిసరిగా పుణ్యాహవచనం చేయించి, వీలును బట్టి హోమం చేయించుట మంచిది .
తెలిసి కూడా ఈ శాంతులను త్యజించకుండా చేయించి, గండనక్షత్రములలో జన్మించిన శిశువు, దుష్ట నక్షత్రంలో రజస్వల అయిన ఆ కన్యా దోషములు తొలగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకొంటున్నాము.
సేకరణ: https://www.panditforpooja.com/blog/nava-vidha-shanti-puja/