హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన సోమవారం నాడు మార్కేండయ జయంతి వచ్చింది.
శ్రీ మార్కండేయ మహర్షి జీవిత చరిత్ర, చిరంజీవిగా ఎలా మారాడు?
పూర్వం మృకండుడు అనే ఒక ముని ఉండేవాడు.మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య. వారికున్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశి కి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి , శివుని గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండు మహర్షి ని మరోమారు పరీక్ష చేయడానికి , సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు*.
కొంత కాలానికి శివుని వరప్రసాదం వలన మరుధ్వతి గర్భం ధరించింది. నెలలు నిండాక ఒక చక్కటి బాలుడికి జన్మనిచ్చింది. ఆ దంపతులు బాలుడికి ‘మార్కండేయుడు’ అని నామకరణం చేశారు. మార్కండేయునికి అయిదు సంవత్సరాల వయస్సులో విద్యాభ్యాసానికి గురుకులంలో చేర్చారు. చిన్న వయస్సులోనే మార్కండేయుడు వేదాలు, శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించాడు. అందరితో స్నేహభావంతో మెలిగేవాడు. అతడు తన మంచి ప్రవర్తనతో గురుకులంలోని అందరి మన్ననలు పొందాడు. అందరూ మార్కండేయుడంటే ఇష్టపడేవారు.
ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షిని చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవా అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి, మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.
16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకరులను మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి ! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్దాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుని కోరుకోమన్నప్పుడు పుత్రుని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా మార్కండేయడు చిరంజీవిగా ఉన్నాడు.