- కార్తీక శుద్ద ద్వాదశి రోజున తులసిని పూజిస్తే నిజంగా ఐశ్వరం వస్తుందా? ప్రమాణం ఉందా?
- ఆధ్యాత్మిక పరంగా తులసిపూజ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
- తులసి పూజ చేయుట వెనుక శాస్త్రీయపరమైన కారణాలేమైనా ఉన్నయా?
ఆషాడ మాసమందు శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అని ప్రతీతి. అందుకే గృహిణులు ఆ రోజు క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేస్తారు.
సూర్యాస్తమయ అనంతరం మహిళలు తులసి కోట వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని క్షీరాబ్ధిశయన వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది.
శ్రీకృష్ణుడిగా ద్వాపర యుగంలో అవతరించిన శ్రీమహావిష్ణువు, తులసిని కార్తీక శుద్ధ ద్వాదశినాడు వివాహం చేసుకున్నాడు. అందుచేతనే స్మృతికౌస్తుభం ప్రకారం – కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు, పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళి రోజులాగే కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటిలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి. శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమని భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే. తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథను కూడా గమనించవచ్చును.
శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపమైన,ప్రీతికరమైన ఉసిరికాయలతో కూడిన కొమ్మను కార్తీకశుద్ధ ద్వాదశిరోజు తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందుకే ఆ రోజున తులసీ వివాహం పేరుతో… తులసి, ఉసిరి చెట్టుకు పరిణయం చేస్తారు. శివాలయంలో దీపం వెలిగించి, తులసికి, ఉసిరిచెట్టుకు పూజలు చేసి విశేషమైన పుణ్యఫలితాలను పొందుతారు.
దేవతారాధనకు తులసి దళం చాలా శ్రేష్ఠం. శ్రీమహావిష్ణువు ఎంతో ప్రీతికరంమైన పత్రములలో తులసి ఒకటి. నువ్వులలో దాగిన నూనెలాగా, పెరుగులో దాగిన వెన్నలా, ప్రవాహంలో దాగిన నీటిలాగా, ఇంధనంలో దాగిన అగ్నిలాగా శ్రీమహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది.
తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద ఆకాశదీపం వెలిగించడం సర్వత్రా సుభాఫలితాలని ఇచ్చును. చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.
- ఆధ్యాత్మికం పరంగానే కాక, శాస్త్రీయపరమైన రీతిలో కూడా తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. కేవలం మూడడుగులు వరకు చిన్న పొద వలే ఎదిగే తులసి పరిమళాలను వెదజల్లుతూ దుర్గంధాలు తొలగించి దోమలతో పాటు క్రిమికీటకాలు నశించడానికి చాలా ఉపయుక్తమైనది.
- వైద్యపరంగా, ఆరోగ్యదృష్ట్యా తులసి ఆకులు, గింజలు, వేళ్లు, కొమ్మలు ఉపయోగాకరమైనవే… తులసి దళాలను నీటిలో వేసి తీసుకున్న, నేరుగా తీసుకున్న రుగ్మతలు తొలగి చర్మసౌందర్యం పెరుగును.
- రకరకాల సాంక్రామిక వ్యాధులను(అంటు వ్యాధులు) తులసితో నివారించవచ్చు.