దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉన్నటువంటి దీపమును కామాక్షీ దీపం లేదా గజలక్ష్మీ దీపం అంటారు. సర్వదేవతలకూ శక్తిని ఇచ్చేటువంటి తల్లిగా కామాక్షీ దేవికి ప్రతీతి కలదు. ఈ కారణం చేతనే కామాక్షీ అమ్మవారి ఆలయాలు తెల్లవారుఝామున మిగిలిన ఆలయములకన్నా ముందే తెరువబడతాయి. రాత్రి పూట ఆలయాలన్నీ మూసిన తరువాత మూయబడతాయి. దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉన్న కామాక్షీ దీపం(Kamakshi Deepam) వెలిగేటువంటి ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో, అమ్మ కృపతో నిండి ఉంటుంది.
ప్రత్యేకించి ఈ కామాక్షీ అమ్మవారి దీపాన్ని చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు. హిందువుల ఇళ్ళలోని కొన్ని వంశాలవారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తారు. అంతే కాకుండా ఇంట్లో చేసే విశేష వ్రతాలూ పూజలను ఆచరించే సమయంలో అఖండ దీపముగా కొందరు ఈ కామాక్షీదీపం వెలిగిస్తారు. ఈ కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది.
యజ్ఞ యాగాది కార్యక్రమములందు, ప్రతిష్టలలో, గృహప్రవేశాది కార్యక్రమములలో ఈ కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.
అయితే కామాక్షీ దీపమును వెలిగించే సమయమందు కొన్ని ప్రక్రియలను పాటించవలెను. కామాక్షీ దీపాన్ని వెలిగించినప్పుడు, దీపపు ప్రమిదకు మరియు కామాక్షి అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పుష్పముతో అలంకరించి, అక్షతలను సమర్పించి, అమ్మవారికి నమస్కరించి పూజను చేయవలెను.