సోమవారం రోజున శివుడిని ఎందుకు ఆరాధిస్తారు
హిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. అయితే ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి ఓ ప్రత్యేకమైన కారణముంది. ‘సోమ’ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, శివుడు గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
చంద్రుడు దక్ష రాజు యొక్క ఇరవై ఏడు మంది దత్తపుత్రికలను వివాహం చేసుకున్నాడు. అవి ఆకాశంలోని ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి. అతను 27 మంది యువరాణులను వివాహం చేసుకున్నప్పటికీ, చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం.ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు. మొదట్లో దక్షుడు తన మిగిలిన కుమార్తెలకు అన్యాయం చేయవద్దని సమానంగా చూసుకోమని చెప్తాడు. అయినా వినకపోవడంతో హెచ్చరిస్తాడు కూడా. ఎంతకీ చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాదు. దీంతో ఆగ్రహానికి గురైన దక్షుడు, చంద్రుడిని శపిస్తాడు.
ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును, పరిమాణంలోనూ కుంచించుకుపోతాడు. చంద్రుడు సహాయం కోసం బ్రహ్మదేవుని శరణుగోరుతాడు, అప్పుడు అతను తప్పనిసరిగా శివుడిని ప్రార్థించమని చెప్తాడు.
బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడి శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైన చంద్రుడి అన్నింటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడుకి చెప్పుకుంటాడు. తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు. కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు. దీంతో ప్రతి మాసంలో 15 రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు. ఆ తర్వాత 15 రోజులు తిరిగి తన ప్రభని పరిమాణాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరం ఇస్తాడు. అలా అమావాస్య, పౌర్ణమి వచ్చాయని కథ చెప్తారు.
చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడని అని కూడా పిలుస్తుంటారు. ఈ కారణంగానే చంద్రుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు.అందువల్ల సోమవారం నాడు శివుడిని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.