సూర్యుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించే విధానాన్ని సంక్రమణం అంటారు. సూర్యభగవానుడు ఏరాశిలోకి మారుతాడో ఆ రాశి పేరుతో ఆ సంక్రమణాన్ని పిలవడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనవరిలో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశం అవుతాడు కావునా ఈ సంక్రమణంను మకర సంక్రాంతి అంటారు.
సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజు దాన ధర్మములు చేయడం వలన కలిగేటటువంటి ఫలము కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది. మకర సంక్రమణ పుణ్య సమయంలో చేసేటటువంటి దానధర్మములు సత్ఫలితములు ఇస్తాయని శాస్త్రములు తెలిపాయి. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు తెలిపారు. కేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలటం వలన మిగిలిన అన్ని సంక్రమణ సమయాల్లో తర్పణాలు వదిలిన ఫలితము లభించును. మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణుని పూజ సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి ఆచరించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.