గురు పౌర్ణమి విశిష్ఠత | వ్యాస పూర్ణిమ

Loading

Importance of Guru Purnima

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

|| గురువందనం ||

శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్ |
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||

శ్లో|| చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||

శ్లో|| సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||

శ్లో|| ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||

 

గురు పౌర్ణమి విశిష్ఠత:

ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. ఈ సంవత్సరం గురుపౌర్ణమి (గురు పూర్ణిమ) 2024 జులై 21వ తేదిన వచ్చినది.  అయితే సాధారణంగా అన్ని పండుగలను జరుపుకోవడానికి ఒక నిబద్ధత, విధానం ఉంటె, గురుపౌర్ణమికి మాత్రం అలా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞత ను తెలుపుటయే ఈ గురుపౌర్ణమి (Guru Purnima) ముఖ్య ఉద్దేశ్యం. అందుచేతనే ఈ రోజును ఒకొక్కరూ ఒక్కొక్క విధంగా తమ గురువులకు కృతజ్ఞతా భావమును తెలిపెదరు.  ఇదే రోజున వ్యాసముహాముని జన్మతిథి కావున వ్యాస పూర్ణిమ లేదా వ్యాస జయంతి మహాపర్వదినంగా గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అనాది కాలం నుంచీ ఒక సాంప్రదాయం నెలకొన్నది.

మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు. కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి వుంటే, మరి కొందరికి ఎదుటి వారిని చూసి నేర్చుకునే శక్తి వుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రించే వరకూ ప్రక్క వారి సహాయం అవసరమౌతుంది. అది మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం…. ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేదు. అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతా పితరుల ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సహచర్యంలో, వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు. ఓనమాలు అమ్మ ఒడిలో నేర్చుకుంటే, అ ఆ లు బడిలో నేర్చుకుంటాడు . ఇలా ఎవరో ఒకరి సహకారంతో జీవన పయనం సాగిస్తాడు . కాని అదే జీవితాన్ని ఎటువంటి మార్గంలో, ఎలా నడిపించాలి అన్నమీమాంస ను ఒక్క గురువు మాత్రమే తీర్చగలడు.

1. గురువులనగా ఎవరు?
2. గురువులను ఎలా నిర్దేశించు కోవాలి?
3. గురువులు ఎన్నిరకములు?
4. గురువుల ఆవశ్యకత ఏమిటి?
5. గురు పూర్ణిమను ఎలా జరుపుకోవాలి?

1. గురువులనగా ఎవరు?

అవిద్యా హృదయగ్రంధి బంధమోక్షో భావేద్యతః
తమేవ గురు రిత్యాహు ర్గురుశబ్దార్ధ వేదినః
భావం : ఏ మహానుభావునిచే అవిద్యాహృదయగ్రంధి బంధమోక్షము గలుగునో వారే గురువని గురుశబ్దార్ధం.

శ్లో|| గుశబ్దస్త్వంధకారః స్యాత్ రు శబ్దస్తన్నిరోధకః
అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే
భావం: గు అను శబ్దమునాకు అర్ధం అంధకారము, రు అను శబ్దముకు అర్ధం దానిని నాశము చేయు తేజస్సు. అనగా అజ్ఞానాంధకారమైన చీకటిని నాశముజేసి స్వయంప్రకాశమగు పరబ్రహ్మమును కరతలామలకమువలె జేయువారే గురువని గురుశబ్దార్ధము.

శ్లో|| గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతే
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః
భావం: గుకార మంధకారం(అజ్ఞానం) రుకారం తేజస్సు(జ్ఞానం). అజ్ఞానమను తమస్సును మ్రింగువారే గురువు. వారే బ్రహ్మం.సంశయం లేదు.

శ్లో|| గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః
గుణరూప విహీనత్వా ద్గురురిత్యభిధీయతే
భావం:గుకారం గుణాతీతం,రూపాతీతం రుకారం.నామరూపగుణ రహిత అవస్థ(స్థితి)యగు బ్రహ్మమును తెలుపువారే గురువు.

ఇప్పుడు అటువంటి గురువు కృప అందరికీ దొరకాలని కోరుకుంటూ ఆ గురువుకు నమస్కారము చేయండి.

శ్లో|| గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
భావం: గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను.

శ్లో|| అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః
భావం: అజ్ఞానమనే గ్రుడ్డితనమునకు జ్ఞానమనే కాటుక దిద్ది, ఆత్మను చూపించు గురువుకు నమస్కరిస్తున్నాను.

శ్లో|| అనేక జన్మ సంప్రాప్త కర్మేందన విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః

శ్లో|| వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’
భావం: సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం

శ్లో|| వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
భావం: వశిష్ట మహర్షికి మునిమనువడు, శక్తికి మనువడు, పరాశర మహర్షికి పుత్రుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడు తపోనిదియైన మహర్షికి నమస్కారం.

శ్లో|| అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః
భావం: బహు జన్మల నుండి సంప్రాప్తించిన పాప పుణ్యములు జ్ఞానమను అగ్ని చేత దహింపజేయునట్టి గురువునకు నమస్కరిస్తున్నాను .

2. గురువులను ఎలా నిర్దేశించు కోవాలి?

త్రికరణము లచే హింస చేయని వాడును, సత్యశౌచాదులు కలవాడు, సమస్త జీవ రాశుల యందు దయ కలవాడు, శాంత చిత్తం కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తులు గల వాడు, వేద సంపన్నుడు, పరమభక్తుడు, యోగమును ఎరిగిన వాడు, యోగ నిష్ఠ యందున్నవాడు,సదా యోగాత్మ స్వరూపుడై బహిరంతర శుద్ధి కలవాడు, జ్ఞానము, యోగము,చర్య, క్రియ, అను నాలుగు పాదాంతముల పర్యంతము శాస్త్ర (కర్మ,యోగ,భక్తీ, జ్ఞాన) మెరింగినవాడు, దంభాచారము లేనివాడు, శిష్యుల గుణ దోశాములలో విశిష్ట జ్ఞానం కలవాడును, సర్వ సంశయములను చేదించిన నిస్సంశయుడైన గురువుని ఎన్నుకొని అట్టి గురువు యొక్క కటాక్షమును పొందవలెను.

3. గురువులు ఎన్ని రకములు?

ఆధ్యాత్మిక గురువులు, వారి వారి లక్షణాలను హిందూ సంప్రదాయం ఇలా నిర్వచించింది .

సూచక గురువులు : ప్రకృతిలో లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు . భక్తీ జ్ఞాన వైరాగ్య భొదలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిని భక్తులను తయారు చేస్తారు వీరు…

వేద గురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరింపజేస్తారు వీరు. .

నిషిద్ద గురువులు : సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను భోదిస్తారు వీరు.

కామ్యక గురువులు : ధర్మ దాతలుగా సప్త సాధనాలు భోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన భక్తులను తయారు చేస్తారు.

భోధక గురువులు: వేదాంత గ్రంధ పరిచయం కలిగిస్తారు . భోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని చెప్తున్నారు. వారు…

నాద గురువులు : వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .

చాయానిది గురువులు : చాయానిది అనే ఒక పక్షి వుందట . దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు .

పరమ గురువులు : వీరు పరుసవేదిలా శిష్యుని తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు

చందన గురువులు: చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు వీరు.

క్రౌంచక గురువులు: :దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగా గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట . అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చెయగలడు.

వాచక గురువులు : సాంఖ్య ఉపదేశాలు భోధించి, పరమాత్మ సత్యమని, దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.

కారణ గురువులు : ఆసనాలు, ప్రాఞాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం భోదించి అద్వైత స్థితి ని కలిగిస్తారు.

సద్గురువులు : తెలుసుకోగల్గితే గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు.

నిజ గురువులు: పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు.

4. గురువుల ఆవశ్యకత ఏమిటి?

పురాణ పండ రంగనాథ్ గారు వ్యాసుని విశిష్టత వివరిస్తూ వ్రాసిన వ్యాసం ఇది….. “గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నాలుగు వైపులకు నడిపించే శక్తి ఒకా గురువుకే వుంది. .. అటువంటి గురువును పూజించడం మన సంప్రదాయం . ప్రతి సంవత్సరం హిందువులు ఆషాడ పౌర్ణమి నాడు వేద వ్యాసుని జయంతిని గురు పౌర్ణమి పేరుతొ జరుపుకుంటారు ” …బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ట మహా ముని, ఆతని కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరునికి, మత్స్యగంధి సత్యవతి ద్వారా విశ్వ తేజస్సుతో జన్మించిన వాడే వ్యాసుడు. తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఏక రాశిగా వున్న వేదాన్ని ఋక్, యజు, సామ, అధర్వణ అనే నాలుగు భాగాలుగా సులభ గ్రాహ్యం చేసినందుకు ఆతడు వేద వ్యాసుడు అయ్యాడు.

Vyasa Purnima

నావ యందు (ద్వైపాయనం ) జన్మించాడు కాబట్టి మరియు నలుపు రంగులో వున్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరుగాంచాడు. పద్దెనిమిది పురాణాలను, పద్దెనిమిది ఉప పురాణాలను, విజ్ఞాన సర్వస్వం ఐన మహాభారతాన్ని, బ్రహ్మ సూత్రాలను, ఆధ్యాత్మ రామాయణమును రచించి, కలియుగ మానవాళికి కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాలను ఉపదేశించాడు ..

ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాస మహర్షి భోదించాడు.

5. ఈ గురుపూర్ణిమను ఎలా జరుపుకోవాలి?
(How to perform Guru Purnima)

తాను జీవితమంతా గురు సేవ చేసిన సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా పాటించాలని షిర్డీ లో బాబా తన భక్తులకు ఆదేశించాడు. గురువును పూజించడానికి వ్యాసుని జయంతి అయిన వ్యాస పౌర్ణమి (వ్యాస  జయంతి) ని మించిన రోజు లేదని భావించి, ఆ రోజును గురు పౌర్ణమిగా నిర్ణయించి పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు. ధుని దగ్గర వుండే స్తంభాన్ని గురువుగా భావించి పూజిస్తానంటే తనకు ఎట్టి అభ్యంతరం లేదని, తనను పరమాత్మగా భావించవద్దని బాబా ఆదేశం. బాబా ఆదేశం ప్రకారం మొదటి సారిగా గురుపూజ చేసిన వ్యక్తి చంద్రాబాయి బోర్కర్.

guru pournami, gurupurnima, importance of guru purnima, vyasa Jayanthi
శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?
విజయాలను చేకూర్చే అక్షయ నవమి – విశిష్టత

Related Posts

No results found.

Comments

1 Comment. Leave new

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.