కొత్త బట్టలతో కోలాహలం, ఇచ్చిపుచ్చుకొనే మిఠాయిలతో ఆనందం, ఎటు చూసినా దీపాల వెలుగులు, మతాబులు – చిచ్చుబుడ్డుల మిరుమిట్ల కాంతులు దీపావళి పండుగకు సంకేతములు. భారత దేశంలో కోటి దివ్వెల కాంతుల కలయిక అయిన దీపావళి పండుగ యొక్క ప్రాశస్త్యం ఇప్పుడు మనం తెలుసుకొందాం.
- దీపావళి పండుగను ఎన్ని రోజులు పండుగగా జరుపుకొంటారు?
- దీపావళి జరుపుకోవడానికి ప్రధానమైన పురాణ కధనాలు ఏవి?
- దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి
- దీపావళి రోజున ఏ యే పూజలను చేయాలి?
దీపావళి పండుగను ఎన్ని రోజులు పండుగగా జరుపుకొంటారు?
భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగే దీపావళి. ఇది మన ఆంధ్రా – తెలంగాణా రాష్ట్రాలతో సహా తక్కిన దక్షిణ భారతీయులకు ముఖ్య పండుగ. దీనిని ఐదు రోజుల పండుగగా ఆస్వయుజ మాస బహుళ త్రయోదశి నుంచి జరుపుకొంటారు. మెదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి అమావాస్య, నాల్గవ రోజు గోవర్ధన పూజ ఆఖరిది బలి పాడ్యమి.
దీపావళి జరుపుకోవడానికి ప్రధానమైన పురాణ కధనాలు ఏవి?
- నరకాసుర వధ – ఆశ్వయుజ బహుళ పక్ష చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు సత్యభామ చేతిలో నరకాసురుని వధ జరిగింది. నరకాసురుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి.
- బలిచక్రవర్తిరాజ్య దానము – వామనావతారములో వచ్చిన శ్రీమహావిష్ణువు అడిగిన మూడు అడుగుల స్థలాన్ని ఇచ్చిన బలిచక్రవర్తి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదించిన శుదినమిది.
- శ్రీరాముడు సతీసమేతంగా రావణసంహార అనంతరము అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని భరత్ మిలాప్ లో పేర్కొనబడినది.
- విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు కూడా ఈరోజే.
అయితే ధర్మసింధుతో సహా మిగిలిన గ్రంధములలో బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడినది. మిగిలిన వృత్తాంతములు కధలు ఏ గ్రంధములోనూ ప్రస్తావించబడలేదు.
దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి?
సంపదకు, ఆనందానికి, ఐశ్వర్యానికి సంకేతంగా ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైనది దీపావళి. ఈ రోజున లక్ష్మీ దేవిని ఆరాధించాలి. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. లక్ష్మీపూజ చేసుకొని కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించడం వల్ల ఋణ విముక్తులై, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అంతేకాక దీపావళి రోజున ఏ ఇంట సమృద్ధిగా దీపాలు వెలుగుతాయో.. ఆ ఇంతట్లోకి శ్రీమహాలక్ష్మీ ప్రవేశిస్తుందని ప్రఘాడ విశ్వాసం.
దిబ్బు దిబ్బు దీపావళి |
దిబ్బు దిబ్బు దీపావళి ||
దిబ్బు దిబ్బు దీపావళి |
మళ్ళీ వచ్చే నాగులచవితి ||
అంటూ గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి చిన్న పిల్లలకు దిష్టి తీయడం కూడా సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలలో వస్తున్న ఆచారం.
దీపావళి రోజున ఏ యే పూజలను చేయాలి?
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
ఈ దీపావళి పండుగ రోజున ప్రతీ ఇంట మహాలక్ష్మి పూజను చేసుకోవలెను. కూర్చొని యున్న లక్ష్మీ దేవికి ఎర్రటి పద్మములతో లేదా తెల్ల కలువలతో పూజను చేయవలెను. అమ్మ వారి అలంకరణకు ఎర్రటి గులాబీలు వాడవలెను. మహాలక్ష్మి అష్టకము, కనకధారాస్తోత్రములు పారాయణ చేయవలెను. దేవాలయములో లక్ష్మీఅష్టోత్తర పూజను చేయించుకోవచ్చును.
కొందరు స్త్రీలు ఈ రోజున లక్ష్మీ కుభేర హోమములు, కేదారేశ్వర వ్రత పూజ, సత్యనారాయణ వ్రత పూజ, వైభవలక్ష్మీ వ్రతములను ఆచరించెదరు.
సాయంత్రం 6గంలు దాటిన తరువాత 2వెండి దీపారాధనలను 5+5 తామరవత్తులను ఆవునేతితో వెలిగించి, ఎర్రటి కుంకుమతో 108మార్లు ఓం మహాలక్ష్మీదేవ్యైనమః అని కుంకుమ పూజను చేయవలెను.