సూర్యుడు ఏడాదిలో ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం.
సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం – “ధనుర్మాసం”. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన “తిరుప్పావై” ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును “మధుసూదనుడు” అనే పేరుతో పూజించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.
గోదాదేవి కల్యాణం, కాత్యాయని, శ్రీవ్రతం చేస్తే సకలశుభాలు కలుగుతాయని భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి భక్తిశ్రద్ధలతో ప్రతిమను తయారుచేసి నారాయణుడి ఆవాహన పూజలు చేస్తారు. రోజూ పూజకు పంచామృత స్నానం, తులసి దళాలతో అర్చన, నైవేద్యాలుగా నెయ్యి, బియ్యం, బెల్లం, మిరియాలు, పెసరపప్పు, పొంగలి, జీలకర్ర వేసి తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి పక్షం రోజులు ఈ నైవేద్యాలను, మిగిలిన పక్షం రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సూత, శౌనకాది మహామునులు వ్రత విధానాన్ని బోధించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధనస్సు సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని కాత్యాయనీ వ్రతంగా కొందరు ఆచరిస్తారు. ధనుర్మాసంలో గోదారంగనాథ స్వామిని ఆరాధించడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మాసంలో పాశురాలను చదవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తోంది. ధనుర్మాస వ్రతం ఆచరించడం వలన చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మాసం రోజులు భగవంతుడిని ఆరాధించి పుణ్య ఫలాలను పొందాలని పండితులు సూచిస్తున్నారు