అపమృత్యువును తొలగించే అన్న చెల్లెళ్ళ జరుపుకొనే పండుగే ఈ భగినిహస్త భోజనం. భగిని అంటే అక్క/చెల్లెలు. హస్త భోజనం అనగా చేతి భోజనము.
సనత్కుమార సంహితలో ఈ భగినిహస్త భోజనంగూర్చి పూర్తి వివరాలు చెప్పబడ్డాయి. ఈ రోజునే యమ ద్వితీయ అంటారు.
సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక – ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు. కార్తీక మాసములో రెండవరోజయిన విదియ తిథి నాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. యమున(యమునా నది) తన సోదరుడయిన యముడి(సమవర్తి)ని సత్కరించినది. ఆరోజును భగినీ హస్త భోజనముగా వ్యవహరిస్తారు. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున “అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు” అని అర్ధించింది. యముడు “తధాస్తు! శుభమస్తు! ” అని అనుగ్రహిస్తూ “అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు” అని అంటాడు.
ఆరొజు సోదరులను తమయింటికి పిలచి ,భోజనము పెట్టి వారి ఆశీర్వాదము తీసుకొనుట భారతదేశములో మహిళలు పాటించే ఆచారము. ఆ సోదరులు కూడా తమ సోదరి లను కానుకలతో సత్కరిస్తారు. దీనివలన వారి మాంగల్యబలము మరింత శక్తివంతమవుతుందని శాస్త్రవచనము. అలాగే తమచెల్లెళ్లను సత్కరించిన వారికి అపమృత్యువు లేకుఁడా వరమిచ్చాడు యమధర్మరాజు. ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.