మనశ్శాంతి లేదా? చిత్తశుద్ధి కలగడం లేదా?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

  1. మనశ్శాంతి లేకపోవడానికి గల కారణములేమి?
  2. నవీన యుగంలో జనులందు లోపించిన విషయములేమి?
  3. చిత్తశుద్ధి కలగడానికి దోహదపడే అంశములేమి?
  4. స్వార్థపూరితమైన జీవనంతో ఎదురయ్యే సమస్యలేమీ?
  5. దోషదర్శనం వలన మనశ్శాంతి లోపించునా?

చిత్తశుద్ధి, మనశ్శాంతి కలగడానికి కొన్ని మార్గాలున్నాయి. మన పెద్దలు ఈ విషయాలను అతి శ్రద్ధతో అనుసరిస్తూ వచ్చినందువల్లనే జీవితంలో వారికి తృప్తి, సంతోషాలకు కొదవలేదు. మనమూ వారు వెళ్ళిన మార్గాల్లో అనుగమిస్తే, మన జీవితాలు శాంతిప్రదాలవుతాయి. మన పూర్వీకులు ఆరోజుల్లో స్నేహ బాంధవ్యాలను చక్కగా పాటించేవారు. ఒక ఇంట్లో పెండ్లి జరిగినా, లేదా ఏదైనా అశుభం జరిగినా అందరూ కలసి, పరస్పర సాహాయయంగా ఉండేవారు. ఆ సహాయం ఈ రోజుల్లోలా బాహిరంగ ప్రకటనగా, ప్రచార ఉద్దేశ్యంతో ఉండేది కాదు. బీదలకు సహాయం పేరు కోసమో, గొప్పల కోసమో కాకుండా నిజంగా వారి అభివృద్ధిని మనసారా కాంక్షించే చేసేవారు.

పూర్వం బంధువర్గంలో ధనికులకూ, బీదలకూ జీవన విధానంలో పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. ధనికులైన వారు బీద బంధువులకు విశేషంగా ధనసహాయం చేసేవారు. దీనిని వారు ధర్మకార్యంగా భావించేవారు. బాధితునికి చేసే సహాయం, సహాయం పొందినవాని కన్నా సహాయం చేసిన వారి చిత్తశుద్ధికి ఎక్కువ తోడ్పడుతుంది. ముఖ్యంగా పరోపకారాన్ని ఈశ్వరారాధనగా భావించి చేసినప్పుడు, ప్రత్యక్షంగా అవి ఇతరుల కోసం చేసినట్లు కనిపించినా వాస్తవంగా అవి మన చిత్తశుద్ధికీ, ఆత్మతృప్తికీ కారకాలవుతాయి. మనం చేసే ఉపకారం ఇతరులకు లాభిస్తుందో లేదో, వారికి ఆ ఉపకారం అవసరమో లేదో, ఆ కార్యాల వల్ల మనకు కలిగే తృప్తి, సంతుష్టి చేత అది పరోపకారమే కాక, స్వోపకారంగా పరిణమిస్తుందని కొంచెం ఆలోచిస్తే తెలుసుకోగలం. అలాంటి పరోపకార కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రమదాయకంగా ఉన్నా తరువాత కలిగే అవ్యక్తానందం వర్ణనాతీతం.

కానీ ఇదంతా ఇప్పుడు మారిపోయింది. ఈ కాలపు ప్రజలు పూర్వకాలపు బాంధవ్యం మరచిపోయారు. చాలా వరకు సంపన్నులకు సహాయబుద్ధి కొరవడింది. పూర్వం విరివిగా అన్నదానం చేసేవారు. కానీ ఈకాలంలో ధనికులు ఉన్నవారికే విందు వినోదాల రూపంలో అన్నదానం చేస్తున్నారు. బీదలను పట్టించుకోవడం లేదు. ద్రవ్యమేమో విచ్చలవిడిగా ఖర్చవుతున్నా, ఆఖర్చు ధర్మానికో, సత్కార్యానికో మాత్రం వినియోగించడం లేదు. ఈవిందు వినోదాలు ఓ వేడుకలా, తమ వైభవాన్ని చాటుకునేందుకే చేస్తున్నారు. ఇందులో పరోపకారం అన్న ప్రసక్తే లేదు. అంతా స్వార్థపూరితమే!పూర్వకాలంలో అన్నదానమో, ద్రవ్యదానమో చేసేటప్పుడు, దాతకూ, గ్రహీతకూ ప్రియమూ, సంతోషమూ ఉండేవి. ఈ రోజుల్లో ఇవి రెండూ మృగ్యమే! ఈ సంపన్నమైన వేడుకలు, వైభవాలు ఈర్ష్యలకూ, అసూయలకూ కారణమవుతున్నాయి. లేనిపోని పోటీలను పెంచి పోషిస్తున్నాయి.ద్రవ్యరూపంగా సహాయం చేయలేనివారు, శారీరకంగానైనా ఇతరులకు తోడ్పడాలి. శ్రీమంతుడు, బీదవాడు అన్న భేదం లేకుండా సామూహికంగా సేవలలో పాల్గొనాలి. దారిలో పడి ఉన్న ఒక ముండ్ల కంపను తీసివేసినా అది సహాయమే! అందరూ కలసి ఒక చెరువో, బావో తవ్వడమూ పరోపకారమే! ఇలాంటి పనులన్నీ మనలో చిత్తశుద్ధిని పెంపొందిస్తాయి.

మనలో మనశ్శాంతి కొరవడడానికి మరో కారణం మనలోని దోషదర్శన గుణం. ఎదుటి వారిలో ఏ లవలేశమైనా మంచి గుణముంటే దానిని గుర్తించి, శ్లాఘించాలి. అంతేతప్ప, నిరంతరం దోషదర్శనం మంచిది కాదు. చంద్రునికి కూడా కళంకముంది. అయినా పరమశివుడు చంద్రుణ్ణి తన శిరస్సుమీద ఉంచుకొని, తన ఉత్తమాంగంలో ఉన్నతస్థానాన్నికల్పించాడు. ఆ ఈశ్వరుడే కరాళమైన గరళాన్ని తన కంఠంలో ఉంచుకొని గరళకంఠుడైనాడు. కానీ ఈకాలంలో ఎక్కడ చూసినా గుణదోష విమర్శ విరివిగా సాగుతోంది. చదువుకున్న వారిలో ఈ దోష దర్శనం మరింత పెరిగింది. ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతున్నారు. ఎన్ని ఎక్కువ దోషాలు పట్టుకుంటే అంత పెద్ద విద్వాంసుడనే తప్పుడు అభిప్రాయం కూడా మనలో ఉంది. దోషజ్ఞుడు అంటే దోషాన్ని తెలుసుకున్నవాడని అర్థమే కానీ, దాన్ని ప్రచారం చేసేవాడని కాదు. తప్పు చేసిన వారికి హితవు చెప్పాలే తప్ప, వారిని చిన్నచూపు చూడరాదు. దోషప్రచారం ఎన్నడూ చేయరాదు

 

చతుర్వేదములు – వివరణ
కుంకుమ/తిలక ధారణం – కుంకుమ వైశిష్ట్యం

Related Posts

No results found.

Comments

2 Comments. Leave new

  • వాసిరెడ్డి శ్రీనివాసరావు
    08/12/2015 1:29 AM

    Comment… మనస్సాంతి లభించటానికి ఇంకా మంచి విషయాలు చెప్పగలరు.

    Reply
    • Ravi Kumar Sharma Pendyala
      08/12/2015 4:04 AM

      తప్పకుండా శ్రీనివాసరావుగారు..!
      మీ కోరిక మేరకు మరింత విలువైన సమాచారమును అందించగలము.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.