మంత్రం ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రమైనా గురోపదేశం లేనిదే ఫలించదు. మంత్రాలను పురాణాలలో చెప్పిన విధంగా మాత్రమే పఠనము చేయాలి.
మంత్రాన్ని టివీలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ, సెల్ ఫోన్ యొక్క రింగ్ టోన్ లాగా, కారు వెనక్కి వెళ్ళేటప్పుడు బజర్ లలాగా ఉపయోగించడం మహాపాపం. మత్రోచ్చారణకి కఠోరమైన నియమాలున్నాయి. కోరిక తీరాలని, త్వరగా ధనం సంపాదించాలనే ఆశ చాలామందికి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారుపాలు అవుతున్నాయి.
ప్రస్తుత కాలంలో రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఈ చర్యల వల్ల మనం ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా అవి మనల్ని పతనం వైపుకి తీసుకెళతాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. అందునా మూల మంత్రాలను గురోపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. తద్వారా భగవత్ సాక్షాత్కారం లభించదు. ఆ రీతిలో చేయడానికి అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి వాటిని హాయిగా పాడుకోవచ్చు, తప్పులేదు.
ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రాన్ని ఉపదేసించడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు. అలా ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఆ మంత్రం యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది.
కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. నమశ్శివాయ, శివాయ నమః కూడా పంచాక్షరే. ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః – భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్రమే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేసినా సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.
సేకరణ: https://www.panditforpooja.com/blog/can-we-keep-mantra-as-mobile-ringtone/