కొందరు భక్తులు వారి భక్తికి పరాకాష్టగా అనేక పనులు పూజలో చేస్తుంటారు. వాటిలో ఒకటి పూజలో కొబ్బరికాయకు పసుపు కుంకుమ రాయడం. అసల ఇలా రాయడం అవసరమా? ఏ శాస్త్రంలో అయినా ఉందా???
పసుపు మరియు కుంకుమ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. కొందరు కొబ్బరికాయను కొట్టేముందు కాయకు వాటిని అలంకరిస్తారు. అది ఒకవిధంగా సబబే. అందువలన ఆ కాయచుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి. కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఎంత మాత్రమూ సరిఅయినది కాదు. అసలు ఇలా చేయమని ఏ శాస్త్రంలోనీ ప్రస్తావించలేదు. భగవంతుడిని ఆవాహన చేసి, వచ్చాడు అని నమ్మి దేవునికి పూజ చేస్తాము. ఆ విధంగానే మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యములో కొబ్బరికాయను కొట్టి, కొబ్బరిని సమర్పిస్తున్నాము. ఈ ప్రక్రియ మన ఇంటికి ఒక అతిధిని పిలిచి ఫలహారం పెట్టడం లాంటిది. మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిధికి పెడితే కుంకుమా పసుపుతో ఉన్న కొబ్బరి తింటామా? కుంకుమ ఉంటే కడుక్కుని మరీ శుభ్రం చేసుకొని తింటాము. అలాంటాప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమా పసుపూ చల్లి పెట్టడం తప్పో కాదో మీరే ఆలోచించండి. ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనదీ తింటామో అటువంటి దాన్ని మాత్రమే పవిత్రమైనదిగా స్వామికి నివేదించాలి.
సేకరణ: https://www.panditforpooja.com/blog/should-we-decorate-coconut-with-kumkum-in-naivedyam/