యజ్ఞ్యోపవీతము(Yagnopaveetham) లేదా జంధ్యం(Janeu) ను బ్రహ్మసూత్రము అని కూడా అంటారు. జంధ్యాన్ని హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మణులు ధరిస్తారు. కానీ సాంప్రదాయమును బట్టి ఎవరైనా ధరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఆర్యసమాజ్ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి అందరిని జంధ్యంను ధరించమనేవారు. అలాధరించడం వల్ల ముగ్గురు దేవత అనుగ్రహం పొందవచ్చును. యజ్ఞ్యోపవీతం లో ఉండే మూడు పోచలు శక్తినిచ్చే పార్వతి, ధనాన్నిచ్చే లక్ష్మి, చదువునిచ్చే సరస్వతి కి ప్రతీకలు. అట్టి యజ్ఞ్యోపవీతం శరీరంపై కలిగియున్న వారు సంధ్యావందనమును (Sandhyavandanam) చేయుటవల్ల బ్రహ్మజ్ఞ్యానమును తప్పక పొందవచ్చును.
కానీ కొత్త యజ్ఞ్యోపవీతమును ధరించడానికి (Sacred Thread) లేదా మార్చడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అసలు యజ్ఞ్యోపవీతమును అసల ఎప్పుడెప్పుడు మార్చాలో తెలుసుకోండి. (When should one change Yagnopaveetham?)
- యజ్ఞ్యోపవీతములో ఒక పోచ తెగిపోయినా
- జాతాశౌచము పూర్తి (పురుటి మైలు) అయినప్పుడు
- సగోత్రికులు మైల శుద్ధి అయిన తరువాత
- జంధ్యంనకు చీము, మలము, మూత్రము, రక్తము, లాలాజలము ఇత్యాదుల స్పర్స కలిగినప్పుడు
- రుద్రభూమి యందు కృత్యముల కొరకు వెళ్ళినా (స్మశానం)
- క్షురకర్మ (క్షవరం) చేయించుకొని వచ్చినా
- ఋతుస్రావంలో ఉన్న స్త్రీలను లేదా అసౌచములో ఉన్నవారిని తాకిననూ
- పవిత్ర కర్మల ప్రారంభమందునా
- విదేశీ పర్యటనలను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరగివచ్చినా
- యజ్ఞ్యోపవీత ధారణ పూర్తి అయిన మూడు మాసములకు
- కొన్ని పర్వదినములయందు (శ్రావణ పూర్ణిమ ఇత్యాదులు)
పై సందర్భములలో ఏ ఘట్టము ఎదురైనా నూతన యజ్ఞ్యోపవీతమునకు మూడు చోట్ల పసుపు, కుంకుమ రాసి, సర్వ దేవతలకు నమస్కరించి “మమ శ్రౌత, స్మార్త నిత్య కర్మానుష్టాన, మంత్రానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్నోపవీత ధారణం కరిష్యే !” అని సంకల్పము చెప్పుకొని మంత్రపూర్వకంగా యజ్ఞ్యోపవీతమును మార్చవలెను. పిమ్మట పాత జంధ్యం, కొత్త జంధ్యం కలిపి కుడి అరచేతిలో ఉంచుకుని దశ గాయత్రి మహా మంత్ర జమనును చేయవలెను. అది మొదలు నిత్యం సంద్యావందనం చేసుకొనుట వలన సర్వ శుభములు చేకూరును.