అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.
గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.
అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ
‘అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…‘
లాంటి సరదా పాటలు పాడుకుంటారు.
అట్లతద్ది పూజలో ప్రధాన ఘట్టాలు & నియమాలు:
- గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
- అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.
- అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.
- పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.
- పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.
- ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు.
- పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.
- ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.
- అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు, ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.
- వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.
- వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
అట్లతద్దె వాయం ఇచ్చునప్పుడు చెప్పవలసినది:
‘ఇస్తినమ్మ వాయనం’
‘పుచ్చుకుంటినమ్మ వాయనం’
‘అందించానమ్మా వాయనం’
‘అందుకున్నానమ్మా వాయనం’
‘ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం’
‘ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం’
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ‘అట్లతద్ది‘ జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ‘కార్వా చౌత్‘ వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ‘సెయింట్ ఆగ్నెస్ ఈవ్’ మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.
ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ‘అట్లతద్ది’ లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ‘అట్లతద్ది’ జరుపుకుంటున్నారు.
‘అట్లతద్దె’ వ్రతకధ:
స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో 18వ పేజీ నుంచి సంగ్రహించినది.
అనగనగా సునామా అని ఒక రాజకుమార్తే ఉండేది. అట్లతద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన పడుచు మొగుడు వస్తాడు అని పెద్దవాళ్ళు చెప్పగా విని, ఆమె కూడా తన ఈడు పిల్లలతో కలిసి అట్లతద్ది నోము పట్టింది. పగలంతా పచ్చి మంచినీళ్లు అయినా ముట్టకుండా ఉపవాసం ఉంది. కానీ సునామ అత్యంత సుకుమారి అయిన రాచ పిల్ల కదా, అందువల్ల పగలు నాలుగో ఝాముకే నీరసించి పడిపోయింది. అది చూసి ఆమె అన్నగార్లంతా కంగారు పడ్డారు. ఆమె ఉపవాసం సంగతి తెలుసుకున్నారు. చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదనే నియమాన్ని విన్నారు. అయినా చెల్లెలి మీద ప్రేమ వలన చెరువులో ఉన్న చింతచెట్టు కు అద్దాన్ని కట్టి, దానికి ఎదురుగా వేటు దూరంలో అరికే కుప్పని తగలబెట్టి చెల్లెల్ని తట్టి లేపి, కూర్చోబెట్టి అద్దంలో కనిపించే అరికే కుప్ప మంటను చూపించి అదే చంద్రుడిని భ్రమింప చేశారు. చంద్రోదయమైందన్న అన్నల మాటలను నమ్మి, చంద్ర దర్శనం చేశానని తృప్తిపడి సునామ ఎంగిలి పడింది. కాలం గడుస్తోంది, సునామ ఈడేరింది. పెద్దవాళ్లంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడ సాగారు. అందరి పిల్లలకి పడుచు భర్త లభించారు. కానీ సునామ మాత్రం ఎన్ని సంబంధాలు చూసిన ముసలి పెళ్లి కొడుకు తప్ప పడుచు వాళ్ళు కుదరటం లేదు . అందుకు సునామా దుఃఖించి ఇంకోన్నాలాగితే ముసలి ముతక అని చూడకుండా పెద్దవాళ్లు తనని ఎవరో ఒకళ్ళకి కట్టబెట్టేస్తారనే భయంతో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఊరి చివరలో అడవిలోకి పారిపోయింది. అదృష్టవశాన ఆ రాత్రి లోకసంచారార్థం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి పలకరించి విషయం తెలుసుకుని, అమ్మాయి అట్లతద్ది నోము పట్టి ఉపవాసం ఉండలేక నువ్వు స్పృహ తప్పావు, అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతో అరికే కుప్పను నిప్పు పెట్టి ఆ మంటని అద్దంలో చూపించి అదే చంద్ర బింబమని నిన్ను నమ్మించారు. అది నమ్మి నువ్వు చంద్రోదయ పూర్వమే ఎంగిలిపడ్డావు. అది నోముకు ఉల్లంఘన అయినది. అందువల్లనే నోము సరిగా నోచిన నీ మిత్రురాళ్లకు పడుచు మొగుళ్ళు లభించి. నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్లి మరల ఆ నోము పట్టి సరిగ్గా నోచుకుంటే తప్పనిసరిగా నీకు తగిన యువకుడితో పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. అందుకు ఆనందించిన సునామా ఇంటికి మరల వచ్చి ఈసారి అతి శ్రద్ధగా అట్లతద్ది నోము నోచుకుంది. ఫలితంగా ఆమెకు అందగాడు ఆరోగ్యవంతుడైన పడుచు వరునితో పరిణయం అయింది. సునామా భర్తతో సుఖంగా కాపురం చేసింది.
విధానం: ఆశ్వయుజ బహుళ తదియనాడు రాత్రి నాలుగవ జామునే నిద్రలేచి కాల కృత్యాలన్నీ తీర్చుకొని, ఆ రాత్రి చంద్రోదయం అయ్యేవరకు కటిక ఉపవాసం ఉండి, చంద్ర దర్శనం తర్వాత శుచి స్నాతులై అట్లువేసి గౌరీదేవికి పది అట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తయిదువుకు పదట్లు వాయనం ఇచ్చి కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని అనంతరమే భోజనం చేయాలి. ఇలా పది సంవత్సరాలు చేసుకుని తదుపరి ఉద్యాపన చేసుకోవాలి.
2 Comments. Leave new
Super
We have provided the download option along with preview, please check and download it accordingly.