ముక్కోటి దేవతలున్నారా? వారు ఎవరు? ఎక్కడ? కొందరు ముక్కోటి అనో ,కొందరు 33 కోట్ల అని, వివిధ రకాలుగా చెబుతారు. మనం ఒక్కడ అంకెగా తీసుకొనరాదు. నిజానికి ముప్పది మూడు మంది దేవతలను ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా భావిస్తూ వుంటారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి వుంటుంది.
ముప్పై మూడుమంది దేవతల జాబితాలో అశ్వనీ దేవతలు (ఇద్దరు) … అష్టవసువులు (ఎనిమిది మంది) … ఏకాదశ రుద్రులు (పదకొండుమంది) … ద్వాదశ ఆదిత్యులు (పన్నెండుమంది) దర్శనమిస్తూ వుంటారు. అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా, ధరుడు .. ధృవుడు .. సోముడు .. అహుడు .. అనిలుడు .. అగ్ని .. ప్రత్యూషుడు .. భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.
ఇక శంభుడు .. పినాకి .. గిరీషుడు .. స్థాణువు .. భర్గుడు .. శివుడు .. సదాశివుడు .. హరుడు .. శర్వుడు .. కపాలి .. భవుడు .. ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. ఆర్యముడు .. మిత్రుడు .. వరుణుడు .. అర్కుడు .. భగుడు .. ఇంద్రుడు .. వివస్వంతుడు .. పూషుడు .. పర్జన్యుడు .. త్వష్ట .. విష్ణువు .. అజుడు .. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు. వీరిలో ఒక్కో దేవతను కోటి మంది దేవతలతో సమానంగా భావించి పూజిస్తూ వుంటారు. ఈ కారణంగానే ముప్పైమూడు కోట్లమంది దేవతలని చెప్పడం జరుగుతోంది.
ఇదే మన ముక్కోటి ఏకాదశి. మన హైందవ ధర్మాను సారం ఈ ముక్కోటి దేవతలు గోవులో వున్నారని కూడా చెబుతుంది. మరి ఇంతమంది( ఈ 33 మంది అయినా) ఎలా ఆవులో వుండగలరు అని కూడా కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. ఆవు ఆకారం అంతా పెద్దది కాదే అని కూడా అంటుంటారు. ఈ ముక్కోటి లో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం. మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు
ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ వివిధ ఉద్యోగస్థులుంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ, మొదలగు వారంతా సృష్టిక్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు.
దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలె భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడం మే సనాతన ధర్మం యొక్క విశిష్టత.